తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రగతిభవన్‌ను అంబేడ్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌గా మారుస్తాం... 2 లక్షల ఉద్యోగాలిస్తాం' - రేవంత్ రెడ్డి లేటెస్ట్ న్యూస్

Revanth Reddy Yuvajana Congress: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధైర్యం లేక పీసీసీ అ‍ధ్యక్షుడిగా తాను ఎంపికకాగానే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్‌ను తెచ్చుకున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని గద్దెనెక్కిన కేసీఆర్‌... తన ఇంట్లో అందరికీ ఉద్యోగాలు కల్పించుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే... ప్రగతిభవన్‌ను అంబేడ్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌గా మార్చి.. 12నెలల్లోపే 2లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు.

Revanth Reddy
Revanth Reddy

By

Published : Feb 27, 2022, 8:19 PM IST

'ప్రగతిభవన్‌ను అంబేడ్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌గా మారుస్తాం... 2 లక్షల ఉద్యోగాలిస్తాం'

Revanth Reddy Yuvajana Congress: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలనే డిమాండ్‌తో గాంధీభవన్‌లో యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టారు. నిరసన దీక్షను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రారంభించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సహా ఇతర సీనియర్‌ నేతలు హాజరై దీక్షను విరమింపచేశారు.

కేసీఆర్ ఇంట్లో ఉద్యోగాలు...

అనంతరం మాట్లాడిన రేవంత్‌రెడ్డి తెరాస సర్కార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, ఇతర ప్రజాసంఘాల నేతల నేతృత్వంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నాంది పలికితే... కేసీఆరే స్వరాష్ట్ర పోరాటం చేసినట్లు అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. నీళ్లు-నిధులు-నియామకాలే ప్రధాన అజెండాగా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తే... ఒక్క కేసీఆర్‌ ఇంట్లోనే ఉద్యోగాలు వచ్చాయని ఆరోపించారు. ఏడేళ్లకాలంలో లక్షకుపైగా ఉద్యోగాలు కల్పించి ఉంటే... బిశ్వాల్‌ కమిటీ ప్రకారం లక్షా 90వేల ఖాళీలు ఎందుకున్నాయని ప్రశ్నించారు.

ప్రగతిభవన్‌ అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్...

కాంగ్రెస్‌ అధికారంలోకి ప్రగతిభవన్‌ను అంబేడ్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌గా మార్చడంపైనే తొలి సంతకం పెడ్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ పదవికి రాజీనామాకు చేయాలని తెరాస నేతలు ప్రకటనలు చేస్తున్నారని దమ్ముంటే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ తప్పకుండా ముందస్తు ఎన్నికలకు వస్తారని కాంగ్రెస్‌ శ్రేణులు సంసిద్ధంగా ఉండాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

అందరం కలిస్తేనే...

కాంగ్రెస్‌ పార్టీలో అందరూ కలిసి నడిస్తేనే అధికారంలోకి వస్తామని మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. కష్టపడి పనిచేస్తే రాహుల్‌ గాంధీ టికెట్‌ కూడా ఇస్తారని చెప్పారు. తన రాజకీయ జీవితం యూత్ కాంగ్రెస్‌తోనే ప్రారంభమయిందని... యూత్ కాంగ్రెస్ కోటాలో మంత్రినయ్యానని తెలిపారు. ప్రభుత్వం నిరుద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: ఆటోడ్రైవర్ల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా..: రేవంత్

ABOUT THE AUTHOR

...view details