Revanth Reddy Explanation On Free Electricity Comments : ఉచిత విద్యుత్‌పై తన మాటలను వక్రీకరించి.. తాను వేర్వేరుగా మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి తప్పుదారి పట్టించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు ఉచిత విద్యుత్‌పై ప్రభుత్వ పెద్దలతో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి.. రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనపై వివరణ ఇచ్చారు.
అమెరికాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కాంగ్రెస్ విధానాలను ఎన్ఆర్ఐలకు చెప్పానని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఉచిత విద్యుత్‌పై కొందరు నిపుణుల సందేహాలకు సమాధానం మాత్రమే ఇచ్చానన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ను తీసువచ్చిందే నాటి కాంగ్రెస్ ప్రభుత్వమని స్పష్టం చేశారు. బషీర్‌బాగ్ కాల్పుల ఘటన జరిగినప్పుడు కేసీఆర్ తెలుగుదేశంలోనే కదా ఉన్నారన్నారు. ఉచిత విద్యుత్ ఇవ్వడం కుదరదని ఆనాడు కేసీఆరే టీడీపీ ప్రభుత్వంతో చెప్పించారని గుర్తు చేశారు.
ఉచితం అబద్ధం.. అవినీతి నిజం Revanth Reddy Fires On CM KCR : వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా తొలి సంతకం ఉచిత విద్యుత్ దస్త్రంపైనే చేశారన్న విషయాన్ని అధికార పక్షం గ్రహించాలని రేవంత్ రెడ్డి అన్నారు. రైతుల సాగుకు 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. ఉచిత విద్యుత్‌తో పాటు రాయితీపై ఎన్నో వ్యవసాయ పనిముట్లు ఇచ్చామని.. అలాగే వేల కోట్లను ఇన్పుట్ సబ్సిడీలుగా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందనే విషయం మరిపోకూడదన్నారు.
"ఉచిత విద్యుత్‌పై తన మాటలను వక్రీకరించారు. వేర్వేరు సభల్లో మాట్లాడిన మాటలను బీఆర్ఎస్ నేతలు, కేటీఆర్ ఎడిట్ చేశారు. అమెరికా పర్యటనలో కాంగ్రెస్ విధివిధానాలపై ఎన్ఆర్ఐలతో చర్చించాను. కాంగ్రెస్ పార్టీ గత చరిత్రను, సాంకేతిక పరమైన అంశాలను కూడా వివరించే ప్రయత్నం చేశాను. వాటినే ఇప్పుడు బీఆర్ఎస్ వక్రీకరించింది."- రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
తెలంగాణకు విద్యుత్ విషయంలో సోనియాగాంధీ ప్రత్యేక చొరవ : రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్ విషయంలో నష్టం జరగకుండా కాంగ్రెస్ అధిష్ఠానం జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు. వినియోగం ఆధారంగా తెలంగాణకే ఎక్కువ విద్యుత్ వచ్చేలా సోనియాగాంధీ ప్రత్యేక చర్యలు తీసుకొని.. 40 శాతం జనాభా ఉన్న తెలంగాణకు 53 శాతం విద్యుత్ కేటాయింపులు చేశారని రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రైతులకు విద్యుత్ ఎంత ముఖ్యమో 20 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ ఆలోచించిందన్నారు. వాస్తవంగా కేసీఆర్ 24 గంటల విద్యుత్ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Revanth Reddy Revealed Details America Tour : భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని గతంలో కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. మరి ఆ విద్యుత్ ప్లాంట్లు ఏమైయ్యాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని సెప్టెంబర్ 17న మేనిఫెస్టోలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి :