తెలంగాణ

telangana

ETV Bharat / state

వచ్చే ఏడాది జూన్​లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా: రేవంత్​రెడ్డి - revanth reddy comments on elections

REVANTH REDDY: తెలంగాణలో వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని, జూన్​లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్​ పాలన వల్ల ప్రజలకు ఎలాంటి న్యాయం జరగడం లేదని ఆరోపించారు. రేవంత్​రెడ్డి సమక్షంలో పలువురు నాయకులు కాంగ్రెస్​లో చేరగా.. పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

వచ్చే ఏడాది జూన్​లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా: రేవంత్​రెడ్డి
వచ్చే ఏడాది జూన్​లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా: రేవంత్​రెడ్డి

By

Published : Jun 26, 2022, 10:43 PM IST

వచ్చే ఏడాది జూన్​లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా: రేవంత్​రెడ్డి

REVANTH REDDY: ఈరోజు(జూన్‌ 26)కు చాలా ప్రత్యేకత ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. తనను నమ్మి తెలంగాణ ప్రజల కోసం కొట్లాడాలని సోనియా గాంధీ.. పీసీసీ పదవి అప్పగించారని తెలిపారు. గాంధీభవన్‌లో రేవంత్​రెడ్డి సమక్షంలో చెన్నూరు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి, భాజపా నాయకుడు బోడ జనార్ధన్‌, పలువురు నాయకులు పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. దళితులు, గిరిజనుల కోసం అనేక పోరాటాలు చేశామన్నారు. నిరుద్యోగ జంగ్‌ సైరన్‌తో యువతకు అండగా రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడామని తెలిపారు. వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ ఇస్తానంటే చాలా అవహేళనగా మాట్లాడారని.. కానీ, ఉచిత కరెంటు ఇచ్చి ఆయన రైతుల మన్ననలను పొందారని గుర్తు చేశారు. పేదవాడికి ఆరోగ్యశ్రీ పేరిట అపోలో, యశోదా లాంటి కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్యం అందించిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా పేద పిల్లలకు ఉచిత విద్య అందించామన్నారు.

ఇందిరమ్మ ఇల్లు, రైతు రుణమాఫీ లాంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టింది కాంగ్రెస్‌ మాత్రమేనన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని పునరుద్ఘాటించారు. తెలంగాణ తొలి కేబినెట్‌లో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని.. ఉన్న దళిత మంత్రిని అర్ధాంతరంగా తొలగించారని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. వచ్చే ఏప్రిల్‌, మే నెలల్లో ఎన్నికలు ఉంటాయని.. జూన్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని రేవంత్‌ ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి బోడ జనార్ధన్‌.. చెన్నూరు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి, భాజపా నాయకుడు బోడ జనార్ధన్‌, పలువురు భాజపా నాయకులు, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌కు చెందిన బీఎస్పీ నేత రావి శ్రీనివాస్‌, కోరుట్ల నియోజకవర్గం మెట్‌పల్లి జడ్పీటీసీ, తెరాస నాయకులు రాధ శ్రీనివాస్‌రెడ్డి, కోరుట్ల మాజీ మార్కెట్‌ ఛైర్మన్‌ కళ్లెం శంకర్‌రెడ్డిలు కాంగ్రెస్​లో చేరగా.. రేవంత్‌రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వ్యక్తి రేవంత్‌ రెడ్డి ఒక్కడే అని బోడ జనార్ధన్‌ పేర్కొన్నారు. భాజపాలో బీసీలకు, దళితులకు న్యాయం జరగడం లేదని.. గ్రూప్‌ రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో అరాచక పాలన నడుస్తోందని.. బాల్క సుమన్‌ ఒక్క అవకాశం ఇవ్వండని చెప్పి రూ.వందల కోట్లు సంపాదించారని ఆరోపించారు. తెరాస ఎమ్మెల్యేలు కూడా రూ.వందల కోట్లు సంపాదిస్తున్నారని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details