Revanth Reddy fires on KCR : భద్రత విషయంలో తనను భయపెట్టాలని చూస్తే తాను భయపడే వ్యక్తిని కాదని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను ప్రజల మనిషిననన్న రేవంత్.. భద్రత లేకుండా ఎక్కడికైనా వెళ్లగలనని పేర్కొన్నారు. సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా(OU), కాకతీయ యూనివర్సిటీ(KU)లకు సీఎం కేసీఆర్ వెళ్లగలరా అని ప్రశ్నించారు. తనను ఓడించడానికి కేసీఆర్‌పోలీసులను వాడుకున్నారని ఆరోపించారు. తనకు 69 మందితో భద్రత కల్పించాలని న్యాయస్థానం ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉత్తర్వులను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌కు కావల్సినంత భద్రత కల్పించామని గుర్తు చేశారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు తనకు సైన్యంలా భద్రత ఉంటారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ, మైనార్టీ అనే తేడా ఉండదని, పార్టీలో మైనార్టీలు పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్నారని వెల్లడించారు. బీఆర్‌ఎస్ (BRS) పార్టీ మైనార్టీల కోసం ఏమి చేయలేదని ఆరోపించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లలో (Double Bedroom Houses) ఒక్క శాతమైనా మైనార్టీలకు దక్కలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ హైదరాబాద్‌లో కారు బయల్దేరితే అది దిల్లీ వెళ్లినప్పటికి కమలంగా మారిపోతోందని ఎద్దేవా చేశారు.
Revanth Reddy Interview :బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనన్న రేవంత్ రెడ్డి.. మైనార్టీ ఓట్లను కేసీఆర్.. బీజేపీకి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మైనార్టీలంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ తెచ్చిన ప్రతి ప్రజావ్యతిరేక బిల్లుకి కేసీఆర్ మద్దతు ఇచ్చారన్నారు. బీజేపీ బీఆర్ఎస్ వేర్వేరు కాదని పునరుద్ఘాటించారు. తాము బీజేపీకి (BJP) వ్యతిరేకంగా పోరాడుతున్నామని గుడి, బడి, మసీదు, చర్చి ఎక్కడికైనా వచ్చి చెప్తామన్న రేవంత్... బీఆర్ఎస్ వాళ్లు అలా చెప్పగలరా? అని ప్రశ్నించారు.