Revanth Reddy Comments on KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. బీజేపీ కోసమే.. కేసీఆర్ జాతీయ రాజకీయాలు అంటూ బయలుదేరారని ఆరోపించారు. కర్ణాటక కాంగ్రెస్ నేతలు కొందరు కేసీఆర్‌ను కలిశారని.. తాను చెప్పింది నిజమని బయట పడిందని చెప్పారు. పైలెట్ రోహిత్‌రెడ్డి.. తనను కేసీఆర్‌తో కలిపించారని.. కర్ణాటక కాంగ్రెస్ నేత జమీర్ స్వయంగా చెప్పారని అన్నారు. రోహిత్‌రెడ్డి పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక వ్యక్తి అని పేర్కొన్నారు. హైదరాబాద్ గాంధీభవన్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో.. సీఎం కేసీఆర్ బేరసారాలు చేశారు: కుమారస్వామి లాంటి నేతలు కలిసినప్పుడు బయటకు ఇచ్చిన సమాచారం.. వ్యాపారం కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే కలిసినప్పుడు ఎందుకు గోప్యంగా ఉంచారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో.. సీఎం కేసీఆర్ బేరసారాలు చేశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వారు ఈ డీల్‌కు ఒప్పుకోలేదని తెలిపారు. తాను చేసిన ఆరోపణలకు.. ఆధారాలు బయటకు వచ్చాయని వివరించారు.
కేసీఆర్ చేస్తున్న కుట్ర బయటపడింది:కర్ణాటకలో కాంగ్రెస్‌ను ఓడించేందుకు.. కేసీఆర్ చేస్తున్న కుట్ర బయటపడిందని రేవంత్‌రెడ్డి చెప్పారు. అక్కడ ఏం జరుగుతుందో తాను కామెంట్ చేయనని పేర్కొన్నారు. కేసీఆర్ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి.. ఆయనను కాంగ్రెస్ ఎప్పుడూ నమ్మదని స్పష్టం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను దెబ్బతీస్తే.. బీజేపీకి లాభం జరుగుతుందని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.