Revanth on Rahul Tour: అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను రాష్ట్రప్రభుత్వం నియంత్రించలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాహుల్ పర్యటన కోసం ప్రజాస్వామ్యయుతంగా అనుమతి కోసం ప్రయత్నించిన ఎన్‌ఎస్‌యూఐ నేతలను అరెస్టు చేయడంపై రేవంత్ మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాహుల్ గాంధీ ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు చంచల్‌గూడ కారాగారాన్ని సందర్శిస్తారని తేల్చిచెప్పారు. ఈనెల 7న అరెస్టు అయిన ఎన్ఎస్‌యూఐ నేతలను కలుస్తారని ప్రకటించారు. ములాఖత్‌కు సమయం ఇవ్వాలని జైలు సూపరింటెండెంట్ శివకుమార్‌ను కలిసి వినతిపత్రం అందించారు.
రాహుల్ గాంధీ ఉస్మానియా వర్సిటీని సందర్శిస్తారు: రేవంత్ రెడ్డి - రాహుల్ తెలంగాణ పర్యటన
13:56 May 02
రాహుల్ గాంధీ ఉస్మానియా వర్సిటీని సందర్శిస్తారు: రేవంత్ రెడ్డి
ఓయూకి కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు రాహుల్ గాంధీ పార్లమెంట్లో నిలదీస్తారని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఓయూలో యూజీసీ నిధులు సరిగా వినియోగం అవుతున్నాయా.. ఓయూలో నియామకాలు సరిగా జరుగుతున్నాయా లేదా అని రాహుల్ తెలుసుకుంటారన్నారు. తెలంగాణ రైతులకు అండగా ఉండాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారని రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణ పర్యటనకు రావాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. ఓయూ విద్యార్థి నాయకులను రాహుల్ కలిసేందుకు అనుమతి ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు. పోరాటానికి విద్యార్థులే ఆదర్శమన్నారు. పార్టీలకతీతంగా విద్యార్థి నాయకులు అరెస్టులను ఖండించాలని.. కేసీఆర్ నియంత పాలనపై తిరుగుబాటు చేయాల్సి ఉందన్నారు.
రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించి.. ఓయూ విద్యార్థులతో మమేకమవుతారు. యూజీసీ నిధులు సరిగా వినియోగం అవుతున్నాయా.. నియామకాలు సరిగా జరుగుతున్నాయా? లేదా? తెలుసుకుంటారు. పార్లమెంటు సమావేశాల్లో ఓయూ నిధుల విషయమై నిలదీస్తారు. ఓయూ సభకు అనుమతి అడిగినందుకు విద్యార్థి నాయకులను జైలులో పెట్టి అక్రమంగా కేసులు పెట్టారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాల ద్వారా ప్రభుత్వం ఉద్యమాలను నియంత్రించలేదు. -రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్
సర్కారు అనుమతి ఇవ్వకపోయినా రాహుల్ గాంధీని ఓయూకు తీసుకువెళ్తామని ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అందుకు శాంతిభద్రతల సమస్య వస్తే సర్కారే బాధ్యత వహించాలన్నారు. పోలీసులు ఓయూలో అతిగా ప్రవర్తించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. చంచల్‌గూడ జైలులో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ నేతలను పరామర్శించడానికి రాహుల్ వస్తారని... అందుకు జైలు సూపరింటెండెంట్‌ను కలిసి అనుమతి ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. వరంగల్‌లో 6న రైతు సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: