తెలంగాణ

telangana

ETV Bharat / state

పేపర్ లీక్​కీ.. పేపర్ ఔట్‌కు తేడా వుంది: రేవంత్‌ రెడ్డి - బీఆర్‌ఎస్‌ బీజేపీపై విమర్శలు చేసిన రేవంత్‌ రెడ్డి

Revanth Reddy Chit chat at Gandhi Bhavan: పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్‌ పన్నిన కుట్ర నిజమైతే.. ఆయనకు ఇచ్చిన బెయిల్‌పై ప్రభుత్వం ఎందుకు కోర్టును ఆశ్రయించడం లేదని రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. పేపర్‌ లీకేజీకీ అవ్వడానికి, పేపర్‌ అవుట్‌ కావడానికి చాలా తేడా ఉందని ఆయన పేర్కొన్నారు.

revanth reddy
revanth reddy

By

Published : Apr 8, 2023, 8:39 PM IST

Revanth Reddy Chit chat at Gandhi Bhavan: పేపర్‌ లీకేజీకీ అవ్వడానికి.. పేపర్‌ అవుట్‌ కావడానికి చాలా తేడా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తెలిపారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పన్నిన కుట్ర నిజమైతే.. ఆయనకు ఇచ్చిన బెయిల్‌పై ప్రభుత్వం మరి ఎందుకు కోర్టును ఆశ్రయించడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో జరిగిన మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకైందని.. అదే ఎస్​ఎస్​సీ పేపర్‌ అయితే అవుట్ అయిందని రేవంత్​రెడ్డి చెప్పారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ పరీక్ష రాయడానికే ముందే లీక్ చేశారని.. అందుకే దానిని పేపర్‌ లీకేజీ అంటామన్నారు. అదే పదో తరగతి పేపర్‌ అయితే.. పరీక్ష రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లో ఉండగానే అది బయటకు వచ్చిందని.. అప్పుడు అది అవుటైయిందని అంటారని వివరించారు.

బీజేపీ, కేసీఆర్‌ ఒప్పందంలో భాగంగానే ఈ పేపర్‌ లీకేజీ డ్రామా జరిగినట్లు రేవంత్​రెడ్డి ఆరోపించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీలో రాజశేఖర్‌ రెడ్డి, ప్రవీణ్‌లే కాదు.. ఇంకా చాలా మందినే ఉన్నారని జోస్యం చెప్పారు. అందుకనే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్​ కమిషన్​ను రద్దు చేసి.. మళ్లీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. టీఎస్​పీఎస్సీ పేపర్ దొంగతనం చేసిన వారిని పట్టుకోకుండా.. కొనుగోలు చేసి వారిని.. రాసిన వాళ్లను పట్టుకుంటున్నారని మండిపడ్డారు. అసలు దొంగలను పట్టుకోవాల్సిన సిట్‌.. వారిని వదిలేసి మిగతావారిని అరెస్ట్​ చేస్తున్నారని విమర్శించారు.

ఈ కేసులో ముద్దాయిలు వేరు.. సాక్షులు వేరని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే అసలైన వ్యక్తులను వదిలేసి.. ఛైర్మన్‌, సెక్రటరీ, సభ్యులను సాక్షులుగా పిలిచి అడుగుతున్నారని విమర్శించారు. కాన్ఫిడెన్షియల్‌ విషయాలు కేటీఆర్‌కు ఎలా తెలుస్తున్నాయని.. మంత్రికి సిట్‌ అధికారులే చెప్పుతున్నారా ఏంటి అని ప్రశ్నించారు. టీఎస్​పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో ఇద్దరి పేర్లను కేటీఆర్​ బయటపెట్టారని.. ఆయనను వెంటనే బర్తరఫ్‌ చేయాలన్నారు. ఈ విషయంలో తమ పోరాటం ఆగదని రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు.

నోటీసులు వెనక్కి తీసుకోపోతే.. క్రిమినల్‌ కేసు: మరోవైపు టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ కేటీఆర్‌ బండి సంజయ్‌కు, రేవంత్‌ రెడ్డికి లీగల్‌ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. అందుకుగానూ రూ.100 కోట్ల పరువు నష్టం వేస్తానని మంత్రి అందులో పేర్కొన్నారు. దీనికి బదులుగా రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ.. నోటీసులు కనుక వెనక్కి తీసుకోకపోతే క్రిమినల్‌ కేసు పెడతానని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details