Revanth Reddy Challenged BJP And BRS: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చినట్లేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలపై రైతు స్వరాజ్య వేదిక సమక్షంలో సీఎం కేసీఆర్ చర్చకు రావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ఇక్కడ రైతులు ఉరికొయ్యలకు వేలాడుతున్నలెక్కలు ఎన్సీఆర్బీ రికార్డుల్లో భద్రంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.
మరోవైపు గాంధీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో.. అదానీలకు మోదీ ప్రజా ధనాన్ని దోచిపెడుతున్నారని రాహుల్ గాంధీ ప్రశ్నించినందుకే అనర్హతవేటు వేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అబద్ధాన్ని నిజం అనిపించేలా చెప్పడంలో కేసీఆర్‌కు మించినవాడు లేడని ట్విటర్ వేదికగా ఆరోపించారు. ఈ మీడియా సమావేశంలో రేవంత్‌రెడ్డితో పాటు, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు.
పోస్టు కార్డుల ఉద్యమం: రాహుల్ గాంధీపై బీజేపీ కక్ష కట్టిందని.. అనర్హత వేటు వేసిందని చెప్పారు. ఈ విషయంపై సమాధానం చెప్పలేకనే హుటాహుటిన రాహుల్‌పై ఇలాంటి చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు. అందుకు నిరసనగా రేపు సోమవారం పోస్టు కార్డు ఉద్యమం చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 8న మంచిర్యాలలో భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్లు వెల్లడించారు.