Revanth Reddy fires on KCR and Modi: ప్రపంచ దేశాల్లో శాంతి కోరుకునే వారికి.. అమెరికా నుంచి ఆఫ్రికా వరకు నెల్సన్ మండేలా లాంటి ఎందరో నాయకులకు గాంధీ స్ఫూర్తిగా నిలిచారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. ప్రపంచానికి గాంధీ ఇజాన్ని పరిచయం చేసిన గొప్ప వ్యక్తి బాపూజీ అన్న ఆయన.. గాంధీ ఇజం చరిత్రలోనే నిలబడిందని హర్షం వ్యక్తం చేశారు. వందల సంవత్సరాలు ఈ దేశంపై ఆధిపత్యం చలాయించిన బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఎదురోడి దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని గుర్తుచేశారు.
గాంధీ స్ఫూర్తితో దేశంలో హరిత విప్లవం: ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా, డూ ఆర్ డై నినాదంతో గాంధీ ప్రపంచానికి పరిచయం అయ్యారని ఆయన అన్నారు. బోయిన్పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గాంధీ స్పూర్తితో కాంగ్రెస్ పార్టీ బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు హరిత విప్లవానికి జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహుదూర్ శాస్త్రీ పునాది వేశారని గుర్తుచేశారు.
బడుగు బలహీన వర్గాల వారికి హక్కులు కల్పించింది కాంగ్రెస్:ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్‌ల నేతృత్వంలో అభివృద్ధికి ఎన్నో చర్యలు కాంగ్రెస్ పార్టీ చేపట్టినట్లు ఆయన తెలిపారు. బడుగు, బలహీన, గిరిజన, మైనార్టీలకు హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన కొనియాడారు.