Revanth Reddy Interesting Comments: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అక్కడ అన్ని సర్వేలు తమ పార్టీకి అనుకూలంగా వస్తున్నాయని పేర్కొన్నారు. తాను హవేలీ నియోజకవర్గం ఇంఛార్జ్‌గా ప్రచారం చేశానని వివరించారు. తెలంగాణ నేతలు చాలామంది కర్ణాటకలో ప్రచారం నిర్వహించారని అన్నారు.
Revanth Reddy Comments on CM KCR : ఈనెల 8న హైదరాబాద్‌కు ప్రియాంకగాంధీ రానున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు అండగా ఉండే బాధ్యత కాంగ్రెస్‌పై ఉందని స్పష్టం చేశారు. కేసీఆర్.. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వరని మండిపడ్డారు. బీఆర్ఎస్లో చేరిన మహారాష్ట్ర యువకుడికి ఉద్యోగం ఇచ్చారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
శ్వేతపత్రం విడుదల చేయాలి: మరోవైపు రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా.. సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని తన సెక్రెటరీగా నియమించుకున్నారని పేపర్ లీక్ వ్యతిరేక పోరాట కమిటీ ఛైర్మన్ మల్లు రవి ఆరోపించారు. అతనికి నెలకు లక్షన్నర రూపాయల జీతం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి ఇక్కడి యువతను అవమాన పరిచినట్లేనని విమర్శించారు. ఇలాంటి దొంగ జీవోలు ఇంకా ఎన్ని ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని మల్లురవి డిమాండ్ చేశారు.
సరూర్‌నగర్‌లో నిర్వహిస్తున్న కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన సభకు.. పెద్ద ఎత్తున్న యువత, విద్యార్థులు తరలివచ్చి విజయవంతం చేయాలని మల్లు రవి పిలుపునిచ్చారు. 15 పేపర్లు లీకైతే.. తిరిగి అదే కమిటీతో పరీక్షలు నిర్వహించాలని చూడడంలో అర్థం లేదని ధ్వజమెత్తారు. పూర్తిగా ప్రక్షాళన చేసిన తరువాతనే పరీక్షలు నిర్వహించాలని మల్లు రవి డిమాండ్ చేశారు.