తెలంగాణ

telangana

ETV Bharat / state

Retro Fitting for Autos: పెరుగుతున్న ఇంధనభారం.. రెట్రో ఫిట్టింగ్​ ఓ పరిష్కారం - race energy

Retro Fitting for Autos: రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సొంత వాహనాలున్నా బయటకు తీయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఆటో డ్రైవర్ల పరిస్థితి అయితే మరింత దయనీయం. ఈ నేపథ్యంలో వీరికి ఉపయోగపడేలా సరికొత్త ఆవిష్కరణ చేశారు ఇద్దరు యువకులు. ఆటోలకు రెట్రో ఫిట్టింగ్‌ చేస్తూ ఈవీలుగా మార్చేస్తున్నారు. పెట్రో ఉత్పత్తులతో నడిచే ఆటోలను బ్యాటరీలతో నడిచే విధంగా తీర్చిదిద్దుతున్నారు. వారే రేస్‌ ఎనర్జీ స్టార్టప్‌ వ్యవస్థాపకులు.

Retro Fitting for Autos: పెరుగుతున్న ఇంధనభారం.. రెట్రో ఫిట్టింగ్​ ఓ పరిష్కారం
Retro Fitting for Autos: పెరుగుతున్న ఇంధనభారం.. రెట్రో ఫిట్టింగ్​ ఓ పరిష్కారం

By

Published : Apr 14, 2022, 4:48 PM IST

పెరుగుతున్న ఇంధనభారం.. రెట్రో ఫిట్టింగ్​ ఓ పరిష్కారం

Retro Fitting for Autos: చూశారు కదా..! ఇది పెట్రోల్‌ బంక్‌ కాదు అయినా ఆటోలు వస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్ కొట్టించుకోవట్లేదు. సింపుల్‌గా బ్యాటరీ స్వాపింగ్‌ చేసుకుంటున్నారు. చూడటానికి ఈ ఆటోలు ఎలక్ట్రిక్ వాహనాలలా కనిపించట్లేదు. మరి, బ్యాటరీలు ఎలా స్వాపింగ్‌ చేసుకుంటున్నారని అనుకుంటున్నారు కదా..! ఇవి మామూలు ఆటోలే.. రెట్రో ఫిట్టింగ్‌ ద్వారా ఈవీలుగా మార్చింది.. రేస్‌ ఎనర్జీ స్టార్టప్‌. బిట్స్‌ పిలానీలో చదువుకున్న ఓ కుర్రాడు అరుణ్‌. కళాశాలలో ఉన్నప్పుడే రేస్‌ కార్ల తయారీపై మనసు పారేసుకున్నాడు. ఆ క్రమంలో.. తనలాంటి ఆలోచనలు గల గౌతమ్‌తో కలిసి రేస్ కార్లు తయారు చేసి.. యూరప్‌లో రేసింగ్ కూడా నిర్వహించారు. అలా మోటార్‌ రంగంలో మంచి పట్టు ఉండటంతో 'రేస్ ఎనర్జీ' పేరిట స్వాపింగ్ బ్యాటరీల అంకుర సంస్థ ప్రారంభించారు.

భవిష్యత్​లో ఇలా చేస్తాం.. కాలేజీ అయిపోయిన తర్వాత మాకు ఏం అనిపించిందంటే .. ఈవీ గురించి ప్రతిరోజు వార్తాపత్రికల్లో చదివాం. కానీ రోడ్డు మీదకు వెళ్లి చూస్తే ఒక్క ఎలక్ట్రికల్​ వాహనం కూడా కనిపించేది కాదు. దానిని మార్చి ఒక పరిష్కారం తీసుకురావాలని ఆలోచించి.. 300 నుంచి 500 మంది ఆటోడ్రైవర్లతో మాట్లాడాం. ఇప్పుడున్న ఎల్​పీజీ, సీఎన్​జీ ఆటో రిక్షాలను ఈవీగా మారిస్తే చాలా లాభాలుంటాయని.. ఈ ఆలోచన పని చేస్తుందని వారిని ఒప్పించాం. అప్పటి నుంచి దీనిపై పరిశోధన చేసి 2018లో ప్రారంభించాం. ఇప్పుడైతే ఆటోలకు వరకే ఉంది. భవిష్యత్​లో కార్గో ఆటోలతో పాటు ద్విచక్రవాహనాలకు కూడా ఏర్పాటు చేస్తాం. -అరుణ్, సీఈవో, రేస్ ఎనర్జీ స్టార్టప్

రెట్రో ఫిట్టింగ్‌ ద్వారా..రేస్‌ ఎనర్జీ సంస్థ.. డీజిల్, ఎల్​పీజీ, సీఎన్​జీతో నడిచే ఆటోలను... రెట్రో ఫిట్టింగ్‌ ద్వారా ఎలక్ట్రిక్ వెహికిల్స్‌గా మార్చుతుంది. పైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా... హైదరాబాద్‌లో సుమారు వంద ఆటోలను ఈవీలుగా మార్చారు. వాటికోసం... హైదరాబాద్‌లో దాదాపు 15 ప్రాంతాల్లో స్వాపింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

పైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా..ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్​లో 15 స్వాపింగ్​ కేంద్రాలు ఉన్నాయి. ఈ ఏడాది చివరివరకు నగరంలో ఇంకా 100 కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పుడు నెలకు ఓ 10 స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాం. పైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా... హైదరాబాద్‌లో సుమారు వంద ఆటోలతో నడుస్తోంది. డీజిల్, ఎల్​పీజీ, సీఎన్​జీతో నడిచే ఆటోలను... రెట్రో ఫిట్టింగ్‌ ద్వారా ఎలక్ట్రిక్ వెహికిల్స్‌గా మారుస్తున్నాం. ఉదయం వచ్చిన ఆటోను మధ్యాహ్నం వరకు ఈవీగా మార్చి ఇస్తున్నాం. -అరుణ్, సీఈవో, రేస్ ఎనర్జీ స్టార్టప్

మూడేళ్లు పరిశోధనలు చేసి.. స్వాపింగ్‌ బ్యాటరీలు తయారు చేయాలనే ఆలోచన వీరికి 2018లో వచ్చింది. అప్పటి నుంచి సుమారు మూడేళ్లపాటు వివిధ అంశాలపై పరిశోధనలు చేశారు. ప్రధానంగా హైదరాబాద్ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా బ్యాటరీలు రూపొందిచాలనుకున్నారు. బ్యాటరీ బ్యాకప్ తదితర అంశాలు క్రోడీకరించుకుని 2021లో "రేస్ ఎనర్జీ" స్టార్టప్ ఏర్పాటు చేశారు.

మా టార్గెట్​ ఏంటంటే.. నగరంలో ఓ 6వేల ఆటోలను ఈవీగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పుడయితే 100 ఆటోలతో పైలట్​ ప్రాజెక్టు నడుస్తోంది. ఈ బ్యాటరీలను మొత్తం హైదరాబాద్​లోనే అభివృద్ధి చేశాం. ఆటోడ్రైవర్లు రోజంతా ఆటో నడపాలంటే చాలా ఇబ్బందులు పడుతారు. ఇప్పుడు ఈవీ ద్వారా అందులో గేర్​ వ్యవస్థ ఉండదు కాబట్టి సులువుగా నడపగలుగుతున్నారు. -అరుణ్, సీఈవో, రేస్ ఎనర్జీ స్టార్టప్

ఎన్నో లాభాలు.. ప్రస్తుతం నెలకు 5 నుంచి 10 ఆటోలకు రెట్రో ఫిట్టింగ్‌ చేస్తున్నారు. రెట్రో ఫిట్టింగ్ చేయడం వల్ల ఆయిల్ మార్చడం, గేర్లు రిపేరు చేయించాల్సిన పని ఉండదు. తద్వారా రెట్రో ఫిట్టింగ్‌ ఆటోలు నడిపేవారు రోజూ 300 రూపాయలకు ఆదా చేసుకోవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు పది లక్షల ఆటోలు ఉంటాయని అంచనా. వీటన్నింటికి రెట్రో ఫిట్టింగ్‌ చేస్తే చాలా వరకు వాతావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చు. రెట్రో ఫిట్టింగ్‌కు సుమారు 65వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ మొత్తం ఒకేసారి కాకుండా 10వేల రూపాయలు డౌన్‌పేమెంట్‌ చేసి.. మిగతావి ఈఎంఐ రూపంలో చెల్లించే అవకాశాన్ని కల్పిస్తోంది రేస్‌ ఎనర్జీ సంస్థ.

డ్రైవరన్నలకు ఆదా.. రెట్రో ఫిట్టింగ్‌ చేసిన ఆటోలకు బ్యాటరీలు స్వాపింగ్ చేసేందుకు కేవలం రెండు నుంచి మూడు నిమిషాల సమయం పడుతుంది. రెట్రో ఫిట్టింగ్‌ ద్వారా... నిర్వహణ ఖర్చులతో పాటు సమయం ఆదా అవడం డ్రైవరన్నలకు కలిసి వస్తోంది.

అప్పుడు 400 రూపాయల డీజిల్​ పోయించుకుంటే 100 కిలోమీటర్ల మైలేజీ వచ్చేది. ఇప్పుడు ఈ బ్యాటరీల ద్వారా 160 రూపాయలు పెడితే అంత దూరం వెళ్లగలుగుతున్నాం. డీజిల్​ కంటే ఇది ఎంతో బాగుంది. ఇప్పుడు దీనికి జీరో మెయింటనెన్స్​ ఉంది. -శ్రీశైలం, డ్రైవర్

త్వరలోనే ఆ నగరాల్లో కూడా.. హైదరాబాద్‌లో సేవలందిస్తున్న రేస్‌ ఎనర్జీ సంస్థ త్వరలోనే వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్‌ వంటి ప్రధాన ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అలా పర్యావరణహిత స్టార్టప్‌తో నగరాల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు రేస్‌ ఎనర్జీ స్టార్టప్ వ్యవస్థాపకులు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details