సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. సీజేఐగా పదవీ విరమణ చేశాక ఆయన తొలిసారి హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు, కుటుంబసభ్యులు, బంధువులు, అభిమానులు ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. తెలంగాణ హైకోర్టు సీజే ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.సుధీర్‌కుమార్, జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ పుల్ల కార్తీక్, జస్టిస్ కన్నెగంటి లలిత, జస్టిస్ బి.శరత్‌లు స్వాగతం పలికారు.
ఎమ్మెల్యేలు అరికెపుడి గాంధీ, భాస్కర్‌రావు, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి పుష్పగుచ్ఛం అందించారు. జెడ్ కేటగిరి మధ్య ఎన్వీ రమణ దంపతులు ఎస్సార్‌నగర్‌లోని ఇంటికి చేరుకున్నారు. ఆయన రాకతో నివాస ప్రాంగణం కోలాహలంగా మారింది. అభిమానులు, న్యాయవాదులు, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు జస్టిస్ ఎన్వీ రమణకు ఘన స్వాగతం పలికారు. పలువురు న్యాయవాదులు, అభిమానులు ఆయనను సత్కరించారు. ఇంటికి వచ్చిన అభిమానులతో, న్యాయవాదులతో రమణ ఫొటోలు దిగారు.