రాష్ట్ర పురపాలికల్లో అవిశ్వాసాల పరంపర కొనసాగుతోంది. ప్రభుత్వ తీర్మానం ప్రకారం నిర్ణీత గడువు వరకు అధికారంలో ఉన్న ఛైర్మన్ల తొలగింపుకు అవకాశం లేకపోవడంతోనే.. ఇన్ని రోజులు కౌన్సిలర్లు గుట్టుచప్పుడు కాకుండా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసమ్మతి పర్వాన్ని బయటపెట్టడంతో పాటు ప్రభుత్వంలోని లొసుగులను ఎత్తిచూపిస్తున్నారు సభ్యులు.... ఏదేమైనప్పటికీ అవిశ్వాసాల పర్వం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిందని నేతలు తలలు పట్టుకుంటుంన్నారని చెప్పుకోవచ్చు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ ఛైర్మన్ వస్పరి శంకరయ్యకు వ్యతిరేకంగా కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు. మున్సిపాలిటీలో భారాసకు 8మంది, కాంగ్రెస్ కు - 1, భాజపాకు 1, స్వతంత్రులుగా ఇద్దరు కౌన్సిలర్లున్నారు. సొంత పార్టీ సభ్యులతో సహా 10 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం కోసం కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం ఇచ్చారు. కౌన్సిలర్లను ఛైర్మన్ బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆలేరు నియోజకవర్గంలోనే రెండు మున్సిపాలిటీల్లో ఛైర్మన్లపై అవిశ్వాసం తలెత్తిన పరిణామాలు... ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు తలనొప్పిగా మారాయి.