Telangana budget sessions 2023 : గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయసభల్లో చర్చ ప్రారంభమైంది. రెండు సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిన్న చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తీర్మానాన్ని ప్రతిపాదించగా.. మరో శాసనసభ్యుడు వివేకానందగౌడ్ బలపరిచారు.
గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై శాసనసభలో చర్చ - తెలంగాణ బడ్జెట్ సమావేశాలు అప్డేట్స్
06:06 February 04
శాసనసభలో గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ
శాసనసభలో గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సభలో ప్రసంగించారు. 'తెలంగాణ అభివృద్ధి దేశానికి ఆదర్శంగా మారింది. తెలంగాణ ఆచరిస్తున్న ప్రతి పథకాన్ని... దేశం అనుసరిస్తోంది. తెలంగాణ ఏర్పడే నాటికి 7,778 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే ఉంది. 8 ఏళ్లలో 18,453 మెగా వాట్లకు విద్యుత్ ఉత్పత్తికి చేరింది. పార్లమెంట్ సాక్షిగా రైతుల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా కేంద్రమంత్రి చెప్పారు.' అని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు.
"దేశంలో ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు దేశానికి ఆదర్శంగా ఉంటున్నాయి. రాజకీయ స్వార్థంతో కొంత మంది విమర్శలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ చెపడుతున్న ప్రతి కార్యక్రమం ప్రజల హృదయాల్లో ఉంటున్నాయి. పంటల మార్పిడి విధానంతో 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేయాలని కేసీఆర్ సూచించారు." - సండ్రవెంకట వీరయ్య, బీఆర్ఎస్ ఎమ్మెల్యే
తెలంగాణలో ఆత్మహత్యలు లేవని కేంద్రమంత్రి పార్లమెంట్‌లో ప్రకటించారని ఎమ్మెల్యే సండ్ర అన్నారు. దళితుల గురించి మాట్లాడే కేంద్ర నాయకులకు వారిపై దాడులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. దళితబంధును యూపీ అధికారులు వచ్చి పరిశీలించారని చెప్పారు. దళితబంధుపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారిని రాజకీయ సుడిగుండంలోకి నెట్టవద్దని కోరారు. నూతన పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.