Reservoir Monitoring Committee: జలవిద్యుత్ ఉత్పత్తి, జలాశయాల రూల్ కర్వ్స్, వరదజలాల అంశంపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఆధ్వర్యంలో జలాశయాల పర్యవేక్షణ కమిటీ సమావేశమైంది. హైదరాబాద్ జలసౌధలో కేఆర్ఎంబీ సభ్యుడు ఆర్.కె.పిళ్లై అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేఆర్ఎంబీ సభ్యుడు మౌంతాంగ్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి, ఏపీ జెన్కో అధికారి సృజయకుమార్ పాల్గొన్నారు. కమిటీలో సభ్యులుగా ఉన్న తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, జెన్కో అధికారి వెంకటరాజం భేటీకి హాజరుకాలేదు.
ప్రీ మాన్సూన్ ఏర్పాట్లలో ఉన్నందున ఇవాళ్టి సమావేశానికి రాలేమని, జూన్ 15 తర్వాత సమావేశం నిర్వహించాలని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ నిన్ననే బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాశారు. సాగునీటి అవసరాలు మినహాయించి ప్రోటోకాల్స్ ప్రకారం శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల్లో మాత్రమే కరెంట్ ఉత్పత్తి చేయాలని మొదట్నుంచి చెబుతున్నామని ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ అవసరాల కోసం రెండు జలాశయాలను సమర్థవంతంగా ఎలా వినియోగించుకోవాలో ఈ సమావేశంలో వినిపించామని తెలిపారు.