తెలంగాణ

telangana

ETV Bharat / state

Trains Reservations: సంక్రాంతి పండక్కి ముందే.. రైళ్లలో రిజర్వేషన్లు పూర్తి - Trains Reservations full

గత సంక్రాంతి సమయంలో సెకండ్‌వేవ్‌ భయం కనిపించినా.. ఈసారి సంక్రాంతి పండగ రాకముందే... రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయ్యాయి. గోదావరి, గౌతమి, గరీబ్‌ రథ్‌ వంటి రైళ్లలో నిరీక్షణ జాబితా వందల్లో ఉంది.

Reservations
రిజర్వేషన్లు

By

Published : Nov 24, 2021, 5:15 AM IST

Updated : Nov 24, 2021, 10:44 AM IST

సంక్రాంతి పండక్కి నెలన్నర ముందే రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయ్యాయి. చాలా బండ్లలో చాంతాడంత వెయిటింగ్‌ లిస్ట్‌ కనిపిస్తోంది. గోదావరి, గౌతమి, గరీబ్‌ రథ్‌ వంటి రైళ్లలో నిరీక్షణ జాబితా వందల్లో ఉంది. ఫలక్‌నుమా, ఎల్‌టీటీ, కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లలో పరిమితి దాటి ‘రిగ్రెట్‌’కు చేరింది. ఈసారి సంక్రాంతికి స్వస్థలాలకు బయల్దేరేవారు, జనవరి 9 ఆదివారం కావడం వల్ల అంతకు ముందురోజు నుంచి ప్రయాణాలు పెట్టుకుంటున్నారు. అప్పుడు మొదలుకొని 10-12 వరకు టికెట్లకు భారీగా డిమాండ్‌ ఉంది. 13వ తేదీ కూడా టికెట్లు దొరకని పరిస్థితి ఉంది.

సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, నరసాపురం వైపు రద్దీ తీవ్రంగా ఉంది. ఖమ్మం, విజయవాడ, రాజమండ్రికి వెళ్లాలనుకునే వారికీ టికెట్లు దొరకట్లేదు. ఒడిశా, బెంగాల్‌కు వెళ్లే రైళ్లలో వెయిటింగ్‌ లిస్ట్‌ ఉంది. పుణె, ముంబయి, బెంగళూరు, చెన్నై వంటి ఇతర నగరాల్లో ఉన్నవాళ్లు తెలుగు రాష్ట్రాల్లోని సొంతూళ్లకు ప్రయాణాలు పెట్టుకోవడం వల్ల అటు నుంచి వచ్చే రైళ్లలోనూ రద్దీ ఉంది.

* సికింద్రాబాద్‌-విశాఖ మార్గంలో 10 రైళ్లుంటే జనవరి 11న 9, 12న అన్ని రైళ్లలో వెయిటింగ్‌ లిస్ట్‌ ఉంది. కాకినాడకు 11, 12 తేదీల్లో ఏ క్లాస్‌లోనూ టికెట్లు లేవు. ఎల్‌టీటీ విశాఖపట్నం, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లలో థర్డ్‌ ఏసీలో గరిష్ఠ పరిమితి దాటేసింది. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్‌ క్లాస్‌లో 472, గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో 327 వెయిటింగ్‌ లిస్టు నడుస్తోంది.

* రెగ్యులర్‌ రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయి, భారీగా నిరీక్షణ జాబితా ఉండడంతో ప్రత్యేకరైళ్లు ప్రకటించాలని ప్రయాణికులు కోరుతున్నారు. రామగుండం, మంచిర్యాల, కాగజ్‌నగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మిర్యాలగూడ, వరంగల్‌, కర్నూలు వైపు కూడా పండగ సమయంలో రద్దీ ఉంటుంది. ఈ మార్గాల్లో కూడా అదనపు రైళ్లు ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

కొవిడ్‌ కేసులు తగ్గడం వల్ల...

గత సంక్రాంతి సమయంలో సెకండ్‌వేవ్‌ భయం స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. చాలామంది వాక్సిన్‌ వేయించుకుని ఉండడంతో పెద్దసంఖ్యలో ప్రయాణాలు చేస్తున్నారు. ఈ ప్రభావం సంక్రాంతి రైళ్ల రిజర్వేషన్లలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్నాళ్లు అదనపు ఛార్జీలతో నడిపిన ప్రత్యేక రైళ్లను కొవిడ్‌కు ముందు మాదిరిగానే సాధారణ ఛార్జీలతో నడుపుతుండటం రైలు టికెట్లకు డిమాండ్‌ను పెంచుతోంది.

ఇదీచూడండి:TS MLC elections 2021: స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాల్లోనే కాంగ్రెస్‌ పోటీ

Last Updated : Nov 24, 2021, 10:44 AM IST

ABOUT THE AUTHOR

...view details