తెలంగాణ

telangana

ETV Bharat / state

నగరంలోని చెరువులు, కుంటల్లో వైరల్‌ లోడ్‌ గుర్తించేందుకు పరిశోధనలు - Research to determine viral load in hyderabad

హైదరాబాద్ నగరంలోని చెరువులు, కుంటల్లో కరోనా వైరల్‌ లోడ్ అంచనా కోసం నమూనాల సేకరణ వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు హుస్సేన్‌సాగర్‌లో రెండుసార్లు నీటి నమూనాలు సేకరించగా.. వైరస్‌ ఆనవాళ్లు గుర్తించలేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. సాగర్‌లోకి శుద్ధి చేసిన మురుగునీటిని వదలడంతోనే కొవిడ్‌ ఆనవాళ్లు కనిపించడం లేదని అంచనా వేస్తున్నారు.

వైరల్‌ లోడ్‌ గుర్తించేందుకు పరిశోధనలు
వైరల్‌ లోడ్‌ గుర్తించేందుకు పరిశోధనలు

By

Published : May 16, 2021, 2:30 PM IST

వైరల్‌ లోడ్‌ గుర్తించేందుకు పరిశోధనలు

జంటనగరాల్లో కరోనా వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. తొలిదశ కన్నా.. రెండో దశ అత్యంత తీవ్రంగా వ్యాపిస్తోంది. రెండోదశ ఎప్పుడు మొదలైంది.. మూడో దశ ఎప్పుడు మొదలయ్యే అవకాశం ఉంది.. ఇలాంటి విషయాలపై ఐఐసీటీ, సీసీఎంబీ శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేస్తున్నారు.

రాష్ట్రంలో కొవిడ్‌ రెండో దశ ఫిబ్రవరిలోనే మొదలైందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. మార్చిలో పెరుగుదల కన్పించగా.. ఏప్రిల్‌ నుంచి గరిష్ఠ స్థాయిలో కొనసాగిందని గుర్తించారు. నీటి వనరుల నమూనాల్లోని కరోనా వైరల్‌ లోడు ఆధారంగా శాస్త్రవేత్తలు ఆ నిర్ధరణకు వచ్చారు. వైరస్‌ సంక్రమణ వ్యాప్తిని ముందే తెలుసుకునేందుకు ఐఐసీటీ, సీసీఎంబీ గతేడాది నుంచి మురుగునీటితోపాటు చెరువుల్లో నమూనాలను తరచూ సేకరించి విశ్లేషిస్తోంది. నాచారంలోని పెద్దచెరువు కేంద్రంగా 7 నెలలుగా శాస్త్రవేత్తలు నమూనాలను సేకరించి పరిశోధించారు. మొదట్లో నెలవారీగా విశ్లేషించగా.. ప్రస్తుతం వారం రోజులకోసారి పరీక్షలు చేస్తున్నారు. హుస్సేన్‌సాగర్‌, ప్రగతినగర్‌లోని తుర్కచెరువు, నాచారం పెద్ద చెరువు, నగర శివారు ఘట్‌కేసర్‌లోని ఏదులాబాదు చెరువు, పోతరాజు చెరువుల నుంచి నమూనాలు సేకరించి అంచనా వేస్తున్నారు. కొవిడ్‌ మొదటి ఉద్ధృతి సమయంలో, రెండో ఉద్ధృతి ఆరంభంలో చెరువు నీటి నమూనాల్లోని వైరల్‌ లోడులో తేడాను గుర్తిస్తున్నారు. గతేడాది నవంబరులో తొలి ఉద్ధృతి గరిష్ఠ స్థాయిలో ఉందని.. డిసెంబరు నుంచి జనవరి వరకు తగ్గుతూ వచ్చిందని నివేదికలో పేర్కొన్నారు. ఫిబ్రవరి నుంచి చెరువుల్లోని నీటి నమూనాల్లో వైరల్‌ లోడు పెరిగిందని గుర్తించారు.

మార్చితో పోలిస్తే పెరిగింది..

మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో వైరల్‌ లోడ్‌ మరింతగా పెరిగిందని.. ఇదే గరిష్ఠమా లేదా అనేది మే నెల నమూనాల్ని విశ్లేషిస్తే అంచనాకు రావొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐఐసీటీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ వెంకటమోహన్‌ నాచారం చెరువు ఆధారంగానే ఉద్ధృతిని అంచనా వేస్తున్నామని తెలిపారు. అక్కడ ఫిబ్రవరి నుంచి నీటిలో వైరల్‌ లోడు పెరగడం గమనించామని వివరించారు. మిగతా చెరువు నమూనాలు రిఫరెన్స్‌ కోసమేనని.. హుస్సేన్‌సాగర్‌లో రెండుసార్లు నమూనాలు సేకరించినా.. కొవిడ్‌ వైరస్‌ ఆనవాళ్లు గుర్తించలేదన్నారు. శుద్ధి చేసిన నీటినే సాగర్‌లోకి వదులుతుండటంతో వైరస్ కనిపించకపోవచ్చునని అభిప్రాయపడ్డారు.

నీటివనరుల నమూనాలతోనూ నిర్ధరణ

వైరస్‌ వ్యాప్తిని అర్థం చేసుకునేందుకు మురుగునీటితో పాటు నగరంలోని నీటివనరుల నమూనాలతోనూ నిర్ధరణకు రావొచ్చని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి పరిశోధక నిఘాతో కరోనా వ్యాప్తిని అంచనా వేసి ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చని వివరిస్తున్నారు.

ఇదీ చూడండి: భాగ్యనగరానికి భారీ సంఖ్యలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు

ABOUT THE AUTHOR

...view details