Hyperloop Technology In India :పొడవాటి ఖాళీ ట్యూబ్‌లో ఒక గోళీ వదిలారనుకోండి. అందులో గోళీ చాలా వేగంగా దొర్లుతుంది కదా..! ఈ హైపర్‌లూప్ సాంకేతిక పరిజ్ఞానం కూడా అలాంటిదే. దీంట్లో కూడా టన్నెల్, పాడ్ ఉంటాయి. ఈ పాడ్‌లోనే మనం ప్రయాణిస్తాం.. సుమారు గంటకు 1000-1200 కిలో మీటర్లు వేగం.. విమాన వేగంతో పాటుగా తక్కువ ఖర్చులో అత్యంత వేగంగా దూసుకుపోవడమే దీని ప్రత్యేకత. అయితే ఇది మనం అనుకున్నంతా సులభం కాదు. ఇది ఇంకా అగ్రదేశాల్లోనే అందుబాటులోకి రాలేదు. అలాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో ఓ తెలుగమ్మాయి నాయకత్వ హోదాలో ఉంది. మరి ఆ ప్రాజెక్టు.. తన ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే..
తొలి అవకాశం అందుకున్నా.. :నా పేరు మేధా కొమ్మాజోస్యుల. మాది హైదరాబాద్ నగరం. నాన్న సాఫ్ట్వేర్ ఇంజినీర్. నా చదువు ముంబయి, యూఎస్, హైదరాబాద్‌లో సాగింది. 2020లో మద్రాస్‌లో ఐఐటీ సీటు సాధించా. ప్రస్తుతం ఆటోమోటివ్ ఇంజినీరింగ్ మూడో ఏడాది చదువుతున్నా. కార్లు, ఇతర వాహనాల్లో ఆధునాతన సాంకేతికత తీసుకురావాలన్నదే నా కల.
అందుకే.. హైపర్‌లూప్ ఆలోచన నన్ను ఎక్కువగా ఆకట్టుకుంది. అయితే ఇప్పటికే దీనికోసం ఆవిష్కార్ పేరుతో ఓ విద్యార్థి పరిశోధక బృందం వర్క్చేస్తోంది. నా పనితీరు, ఆలోచనలు వారికి నచ్చడంతో దానికి నన్ను టీమ్ లీడర్‌గా చేశారు. దీనికి మొత్తం ముగ్గురు లీడర్లు ఉండారు. కానీ, అమ్మాయికి ఈ అవకాశం దక్కడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రయాణికులు కూర్చునే పాడ్‌ని రూపొందించడానికి ఒక లీడర్, వాక్యూమ్ ట్యూబ్‌తో పాటు ఇతర మౌలిక వసతులకు గాను మరో లీడర్ ఉన్నారు. ఈ మొత్తం సాంకేతికతను ఎలా సౌకర్యవంతంగా తయారుచేయాలి, అలాగే వాణిజ్య పరంగా ఎలా మలచాలి.. ఇందుకోసం ఇతర కంపెనీలు, ప్రభుత్వాలతో సంప్రదిపుల బాధ్యతలను నేను చూసుకుంటున్నాను.
అయ్యే పనికాదన్నారు.. :మా బృందంలో మొత్తం 50 మంది టీమ్ ఉన్నాం. ఈ ప్రాజెక్టుని వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి పగలూ, రాత్రి కష్టపడి పనిచేస్తున్నాం. ఇందుకుగానూ ముందుగా ఓ చిన్న పాడ్‌ను తయారుచేసి 30మీ ట్రాక్‌పై ట్రయల్స్ చేసి విజయం సాధించాం. దీన్ని మరింత వృద్ధి చెందేలా చేసేందుకు చాలా సంస్థల్ని సంప్రదించాం. మనదేశంలో దీన్ని తీసుకురావడం అసాధ్యమని చాలామంది అన్నారు. మా సాంకేతికత పరిజ్ఞానంపై పూర్తి నమ్మకంతో కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాం. స్వదీశీ హైపర్‌లూప్‌లో దమ్ము ఉందని నిరూపించేందుకు మాకు దాదాపు ఆరు నెలలు సమయం పట్టింది.