తెలంగాణ

telangana

ETV Bharat / state

CS Somesh Kumar: జోనల్‌ విధానంపై సత్వర కార్యాచరణ

రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఉన్న 50 వేల ఖాళీలను భర్తీ చేయాలని... అలాగే బదిలీలు వెంటనే చేపట్టాలని కోరుతూ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్‌ అధికారుల, పింఛన్‌దారుల ఐకాస సీఎస్ సోమేష్ కుమార్​కు వినతి పత్రాన్ని అందజేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు తక్కువ వడ్డీపై రుణాలందించాలని లేఖలో పేర్కొంది.

request-to-cs-somesh-kumar-to-fill-50-thousand-vacancies-and-make-transfers-immediately-in-telanagana
జోనల్‌ విధానంపై సత్వర కార్యాచరణ

By

Published : Jul 6, 2021, 7:19 AM IST

రాష్ట్రంలో కొత్త జోనల్‌ విధానంపై కార్యాచరణ చేపట్టాలని, అన్ని శాఖల్లోని 50 వేల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్‌ అధికారుల, పింఛన్‌దారుల ఐకాస కోరింది. పీఆర్‌సీలోని వేతన వ్యత్యాసాల సవరణ కోసం అనామలీస్‌ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. ఐకాస అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్‌, మమత, ఇతరనేతలు సత్యనారాయణ, ప్రతాప్‌, కస్తూరి వెంకటేశ్వర్లు, రవీంద్రకుమార్‌, కృష్ణయాదవ్‌, వెంకటేశ్వర్లు, ముజీబ్‌, శ్రీరామ్‌లు సోమవారం బీఆర్‌కే భవన్‌లో సీఎస్‌ను కలిసి ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఐకాస నేతలు రాజేందర్‌, మమతలు మాట్లాడారు.

‘‘95% ఉద్యోగాలు, విద్యావకాశాలు స్థానికులకేవర్తించేలా కొత్త జోనల్‌ విధానం అమల్లోకి తెచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఈ విధానం కింద వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. 1984 తర్వాత జిల్లాల వారీగా ఉద్యోగుల సంఖ్య(కేడర్‌స్ట్రెంత్‌) నిర్ధారణ కాలేదు. కొత్త జిల్లాల్లో జనాభా ప్రాతిపదికన పోస్టులు మంజూరు చేయాలి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత బదిలీలు జరగలేదు. వెంటనే వాటిని చేపట్టాలి. ప్రొబేషనరీ డిప్యూటీ తహసీల్దార్ల వంటి వారిని వందల కిలోమీటర్ల దూరంలో నియమించడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. వారిని సమీప జిల్లాలకు బదిలీ చేయాలి. పీఆర్‌సీ సిఫార్సు మేరకు ఉద్యోగుల 1% మూల వేతనం చందాతో నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని మెరుగుపరచాలి. 2018 జులై1 తర్వాత నియమితులైన వారందరికీ 30% ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ ఇవ్వాలి. ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావాలి. 61 ఏళ్ల పదవీ విరమణ వయస్సును అందరికీ వర్తింపజేయాలి. ఉద్యోగులకు వ్యక్తిగత వాహనాలతో పాటు పిల్లల ఆన్‌లైన్‌ తరగతులకు అవసరమైన ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, కంప్యూటర్ల కొనుగోలుకు తక్కువ వడ్డీపై బ్యాంకు రుణ సౌకర్యం కల్పించాలి. గృహ నిర్మాణాలకు ఇచ్చే అడ్వాన్స్‌ను రూ.50 లక్షలకు పెంచాలి’’ అని కోరారు.

ఐకాస వినతిపై సీఎస్‌ స్పందిస్తూ.. రుణాలపై త్వరలో బ్యాంకర్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మిగిలిన అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని, ఆయన ఆదేశాలను అమలు చేస్తామన్నారు.

ఇదీ చూడండి:జులై 19 నుంచి కరోనా ఆంక్షలు ఖతం!

ABOUT THE AUTHOR

...view details