Republic Day Celebrations at BJP State Office: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. వేడుకల్లో విజయశాంతి, నల్లు ఇంద్రసేనారెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్‌తో పాటు పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ అధ్బుతమైన రాజ్యాంగాన్ని అందించారని.. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. అంబేడ్కర్, గవర్నర్, రాజ్యాంగం, కోర్టులు, మహిళలకు కేసీఆర్ గౌరవం ఇవ్వడం లేదని మండిపడ్డారు. పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను కేసీఆర్ ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించిన బండి.. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేయాలని అనుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ నిజాం పోకడలను అవలంభిస్తున్నారని దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్‌కు దేశంలో ఉండే అర్హత లేదని ఆక్షేపించారు. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం బీజేపీ కృషి చేస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.
"అంబేడ్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించారు. రాజ్యాంగ స్ఫూర్తితో నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తున్నారు. పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను కేసీఆర్ ఎందుకు నిర్వహించడం లేదు. కేసీఆర్ నిజాం పోకడలు అవలంభిస్తున్నారు. రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్‌కు దేశంలో ఉండే అర్హత లేదు. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం బీజేపీ కృషి చేస్తుంది." - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఈ సందర్భంగా బీజేపీ కార్యవర్గ సభ్యులు విజయశాంతి సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. కేసీఆర్‌కు, ఆయన పార్టీకి ఓ దండమని.. ఆయన రాజకీయాల నుంచి ఎంత తొందరగా వెళ్లిపోతే అంత మంచిదని అన్నారు. ప్రజలంతా బీజేపీవైపే చూస్తున్నారన్న ఆమె.. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తొందరగా వీఆర్ఎస్ తీసుకొని వెళ్లిపోవాలన్నారు.