రోగానికి చికిత్స చేయాలంటే వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎంతో కీలకం. ఆ నివేదికలు లేనిదే వైద్యులు మాత్రలివ్వరు. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో టెస్టుల కోసం గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. కొన్నిరకాల టెస్టులకు రోజుల తరబడి ప్రదక్షిణలు చేయాల్సిందే. ఉస్మానియా ఆసుపత్రి (Osmania Hospital )లో ఇటీవలి వరకు ఇదే పరిస్థితి. అత్యవసర చికిత్సల కోసం వచ్చేవారికి తొలుత అన్ని పరీక్షలు చేయాలి. మూత్ర పిండాల నుంచి కాలేయం వరకు వివిధ పరీక్షలో వాటి పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాలి. దీంతో పరీక్షల్లో జాప్యం వల్ల రిపోర్టులు వచ్చేవరకు ప్రాథమిక చికిత్సలతో సరిపెట్టాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ ఇబ్బంది తప్పింది. తాజాగా ఉస్మానియా అత్యవసర విభాగంలో ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ ఎనలైజర్‌ను అందుబాటులోకి తేవడంతో రోగులకు ఎంతో మేలు చేకూరుతోంది. నిమిషాల్లో పరీక్షల నివేదికలు వస్తుండటంతో సాధ్యమైనంత త్వరగా గోల్డెన్ అవర్‌లో చికిత్సలు అందిస్తున్నారు.
మొత్తం బయోకెమిస్ట్రీ పరీక్షలన్నీ ఎలాంటి జాప్యం లేకుండా చేస్తున్నారు. అతి తక్కువ సిబ్బందితోనే తక్కువ వ్యవధిలోనే నాణ్యమైన నివేదికలు అందించడానికి వీలు ఏర్పడుతోంది. రీనల్ ప్రొఫెల్, లిపిడ్ ఫ్రొపైల్, టోటల్ ప్రొటీన్, అల్యూబిమిన్, యూరిక్ యాసిడ్, టోటల్ బైలురూబిన్, గ్లూకోజ్, సోడియం, పోటాషియం, ఐరన్ ఇతర అన్నిరకాలు పరీక్షల నివేదికలో అందించడంలో గతంతో పోల్చితే వేగం పెరిగిందని రోగులు చెబుతున్నారు.