తెలంగాణ

telangana

ETV Bharat / state

జలవనరుల శాఖ పునర్వ్యవస్థీకరణ కసరత్తు పూర్తి - telangana government

జలవనరుల శాఖ పునర్వ్యవస్థీకరణ కసరత్తు పూర్తైంది. ఆరుగురు ఈఎన్సీలు, 17 మంది చీఫ్ ఇంజినీర్ల ద్వారా శాఖ కార్యకలాపాలు జరగనున్నాయి. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఈఎన్సీ ఆపరేషన్స్ అన్ని ప్రాజెక్టుల, ఎత్తిపోతల పథకాల నిర్వహణను పర్యవేక్షించనున్నారు. అన్ని స్థాయిల ఇంజినీర్లకు పనుల మంజూరు అధికారాలు ఉండనున్నాయి. పరిధి పెరగడంతో పాటు పునర్వ్యవస్థీకరణతో కొత్తగా 576 సహాయ ఇంజనీర్ల పోస్టులను భర్తీ చేయాల్సి వస్తుందని అంచనా వేశారు.

reorganization-of-irrigation-in-telangana
జలవనరుల శాఖ పునర్వ్యవస్థీకరణ కసరత్తు పూర్తి

By

Published : Aug 4, 2020, 5:00 AM IST

జలవనరుల శాఖగా మారనున్న నీటిపారుదలశాఖ పునర్వ్యవస్థీకరణ కసరత్తు పూర్తయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు, ఇంజినీర్లు కసరత్తును పూర్తి చేశారు. ప్రస్తుతం ఐదుగురు ఇంజినీర్ ఇన్ చీఫ్​లు ఉండగా అందులో ఐదు పోస్టులను యధావిధిగా కొనసాగించనున్నారు. కొత్తగా మరో ఈఎన్సీ పోస్టును ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కోసం ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల పర్యవేక్షణతో పాటు శాఖ ఆస్తుల బాధ్యతలు కూడా నిర్వర్తిస్తారు. డ్యాంల భద్రత, వరద నిర్వహణ లాంటి బాధ్యతలు కూడా ఉంటాయి. రాష్ట్రంలోని మొత్తం భాగాన్ని 17 ప్రాదేశిక విభాగాలుగా విభజించి ఒక్కో పోస్టుకు ఒక్కో చీఫ్ ఇంజనీర్​కు బాధ్యతలు అప్పగిస్తారు. మరో సీఈ పోస్టులు హెడ్ క్వార్టర్స్​లో ఉంటాయి.

సీఈ పరిధిలోనే జలాశయాలు, పంప్​హౌస్​లు

కాళేశ్వరం ప్రాజెక్ట్​లోని మూడు ఆనకట్టలతో పాటు ముఖ్యమైన పంప్ హౌస్​లన్నీ రామగుండం చీఫ్ ఇంజినీర్ పరిధిలో ఉంటాయి. గజ్వేల్ చీఫ్ ఇంజినీర్ పరిధిలో అనంతగిరి మొదలు మిగతా జలాశయాలు, పంపు హౌస్​లు ఉంటాయి. నాగర్ కర్నూల్ చీఫ్ ఇంజినీర్ పరిధిలో పాలమూరు - రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల హెడ్ వర్క్స్ తో పాటు కొన్ని జలాశయాలు, కాల్వలున్నాయి. సాంకేతిక అంశాల కోసం ఒక చీఫ్ ఇంజనీర్ ప్రభుత్వ కార్యదర్శిగా వ్యవహరిస్తారు.

భారీ పదోన్నతులకు అవకాశం

శాఖ పునర్వ్యవస్థీకరణతో కొత్తగా మరో ఈఎన్సీ, ఐదు సీఈ, 12 ఎస్ఈ, 36 ఈఈ, 144 డీఈ పోస్టులతో పాటు 576 ఏఈఈ పోస్టులు అవసరం అవుతాయని అంచనా వేశారు. అందులో మిగతా పోస్టులను పదోన్నతుల ద్వారా, ఏఈఈ పోస్టులను రిక్రూట్​మెంట్ ద్వారా భర్తీ చేయాలని ప్రతిపాదించారు. మరమ్మతులు, ఇతర అవసరాల కోసం పనులు చేపట్టాలంటే ప్రస్తుతం సీఈ ద్వారా ఈఎన్సీకి, అక్కణ్ణుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలి. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాల్సి ఉంది. దీంతో పనులు ఆలస్యమవుతున్నాయి. ఇకనుంచి ఆ పద్ధతికి స్వస్తి పలికి డీఈ మొదలు ఈఎన్సీ వరకు నిర్దిష్ట మొత్తానికి పనుల మంజూరు అధికారాలు ఇవ్వనున్నారు.

ఇవీ చూడండి: 'ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి నీటి విడుదల ఆపాలి'

ABOUT THE AUTHOR

...view details