తోడు లేనిదే అడుగు పడదు... చుట్టూ ఏమి జరుగుతున్నా చూడలేని పరిస్థితి... చీకటి తప్ప వెలుగంటే ఎలా ఉంటుందో తెలియని జీవితం... సమాజంలో ఛీత్కారాలు... అన్నింటా అవాంతరాలు... ఇవేవీ వారి సంకల్పాన్ని నిలువరించలేక పోతున్నాయి. మొలకెత్తే లక్షణం ఉండాలే కానీ విత్తు కూడా భూమిని చీల్చుకుని రాగలదన్నంత సంకల్పంతో ఆ అంధ విద్యార్థులు తమ బతుకుల్లో వెలుగులు నింపుకోడానికి చదువుల తల్లిని నమ్ముకున్నారు. తమ సంకల్పానికి తోడుగా ఏటా పరీక్షల్లో కొంతమంది సహకారంతో పరీక్షలు రాస్తూ విజయానికి బాసటగా నిలుస్తున్నారు.
సికింద్రాబాద్ బన్సీలాల్పేట్లోని సాయి జూనియర్ అంధ విద్యార్థుల కళాశాల ఎందరో బతుకుల్లో వెలుగులు నింపుతుంది. ఇంటర్ పరీక్షల్లో భాగంగా మారేడిపల్లి జూనియర్ కళాశాల కేంద్రంగా జరుగుతున్న పరీక్షల్లో అంధ విద్యార్థులు తమ సహాయకుల సాయంతో పరీక్షలు రాస్తున్నారు. బ్రెయిలీ లిపిలో నేర్చుకున్న పాఠాలను సహాయకులు సాయంతో పరీక్షలు రాస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ వివరించారు. తమ కళాశాల విద్యార్థులు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని జీవితాల్లో స్థిరపడడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.