తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో రెమ్​డెసివిర్​ ఉత్పత్తి.. ఇతర రాష్ట్రాలకు తరలింపు! - remdesivir Move to other states

రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్న రెమ్​డెసివిర్​ ఇతర రాష్ట్రాలకు తరలుతోందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయిన ఇంజక్షన్లను కేంద్రం ఇతర రాష్ట్రాలకు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక అవసరాలకు ఉపయోగించకుండా సరఫరా చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

remdesivir production, remdesivir latest news
రాష్ట్రంలో రెమ్​డెసివిర్​ ఉత్పత్తి.. ఇతర రాష్ట్రాలకు తరలింపు!

By

Published : Apr 21, 2021, 7:28 AM IST

కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రెమ్‌డెసివిర్‌కు డిమాండ్‌ పెరిగింది. దేశంలో గత వారం రోజులుగా రోజూ రెండు లక్షలకు పైగా కొవిడ్‌ కేసులు నమోదవుతుండగా.. క్రియాశీల (యాక్టివ్‌) కేసులు అన్ని రాష్ట్రాల్లోనూ ఎక్కువగా ఉన్నాయి. అన్ని ఆసుపత్రులు కొవిడ్‌ బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ఆక్సిజన్‌ అవసరమైనవారు, ఐసీయూ పడకలపై ఉన్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈ ఇంజక్షన్లకు డిమాండ్‌ చాలా ఎక్కువగా ఉంది. ఆసుపత్రుల్లో చేరని వారికీ దీన్ని వైద్యులు సూచిస్తున్నారు.

రెమ్‌డెసివిర్‌ నిల్వ

రెమ్‌డెసివిర్‌ను హైదరాబాద్‌లోని రెండు సంస్థలు ఉత్పత్తి చేస్తున్నప్పటికీ రాష్ట్రంలోనే కొరత ఏర్పడుతోంది. ఇందుకు కరోనా తీవ్రతను ముందుగా అంచనా వేయలేకపోవడం ఒక కారణమైతే.. ఇక్కడ ఉత్పత్తి అయిన ఇంజక్షన్లను కేంద్రం ఇతర రాష్ట్రాలకు తరలించడం మరో కారణమని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నెల 10న డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ (ఇండియా) వి.జి.సొమాని రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తిదారులందరికీ ఒక లేఖ రాశారు. కొవిడ్‌ తీవ్రత ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు.. ప్రత్యేకించి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌లకు రెమ్‌డెసివిర్‌ నిల్వలను వెంటనే పంపాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఉత్పత్తవుతున్న ఇంజక్షన్లను స్థానిక అవసరాలకు వినియోగించకుండా.. ఇతర రాష్ట్రాలకు పంపించడంపై విమర్శలొస్తున్నాయి. స్థానిక అవసరాలకు తగ్గట్లుగా కేటాయింపులు జరపాలని పలువురు కోరుతున్నారు.

40 శాతమే ఇక్కడికి

రాష్ట్రంలో ప్రస్తుతం హెటిరో, మైలాన్‌ సంస్థలు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు తయారు చేస్తున్నాయి. హెటిరో రోజుకు సుమారు 34 వేల డోసులు, మైలాన్‌ రోజుకు 37 వేల డోసులు ఉత్పత్తి చేస్తున్నాయని వైద్యఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. వీటిలో 60 శాతాన్ని ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రానికి రోజుకు 5-6 వేల డోసులు మాత్రమే అందుతున్నాయి. ఉత్పత్తి చేసిన వాటిలో ఎక్కువ భాగం కేంద్రం ఆదేశాల మేరకు నాలుగు రాష్ట్రాలకు పంపించాల్సి రావడంతో స్థానికంగా కొరత ఏర్పడినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. తమ వద్ద ప్రస్తుతం 15 వేల వయల్స్‌ ఉన్నాయని, నెలాఖరుకు రెండు లక్షల వరకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

ఉత్పత్తి దిశగా ప్రయత్నాలు

రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ను తయారు చేసే సంస్థల్లో క్యాడిలా హెల్త్‌కేర్‌, సింజిన్‌ ఇంటర్నేషనల్‌, రెడ్డీస్‌ ల్యాబోరేటరీస్‌, సిప్లా, మైలాన్‌ ఫార్మాస్యూటికల్స్‌, జుబిలాంట్‌ జనరిక్స్‌, హెటిరో హెల్త్‌కేర్‌ తదితర సంస్థలున్నాయి. ఈ సంస్థలు వేర్వేరు పేర్లతో రెమ్‌డెసివిర్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. దేశంలోని ఏడు ఉత్పత్తి సంస్థలకు నెలకు 38.80 లక్షల వయల్స్‌ తయారు చేసే సామర్థ్యం ఉంది. ఇవి కాకుండా నెలకు 10 లక్షల వయల్స్‌ తయారీకి ఏడు అదనపు కేంద్రాల్లోనూ అత్యవసర ఉత్పత్తికి ఫాస్ట్‌ట్రాక్‌ అనుమతులు ఇచ్చినట్లు కేంద్రం పేర్కొంది. మరోవైపు విదేశాలకు ఎగుమతులనూ నిలిపివేసింది. రాష్ట్రంలోనూ మరో రెండు సంస్థలకు అనుమతిచ్చారు. మరో వారం రోజుల్లో ఉత్పత్తిని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటి ద్వారా అదనంగా 35 వేల డోసులు ఉత్పత్తి అయ్యే అవకాశాలున్నాయి. అప్పుడు రోజూ సుమారు 15 వేల వయల్స్‌ తెలంగాణకు వస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి ఈ ఇంజక్షన్లను రాష్ట్రంలోని ఉత్పత్తి సంస్థలు నేరుగా ఆసుపత్రులకే సరఫరా చేస్తున్నాయి. అవి కూడా ఎక్కువ భాగం ఏ రోజుకారోజు కొంటున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ కొనుగోలు చేసి సరఫరా చేస్తుంది. విపణిలో అందుబాటులోకి వస్తే ఎలాంటి సమస్య ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదీ చూడండి :వరంగల్​ ఎంజీఎంలో సౌకర్యాల కల్పనలో విఫలం: శ్రీధర్​ బాబు

ABOUT THE AUTHOR

...view details