రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలకు సంబంధించి మొదటి విడతలో రూ.200 కోట్లు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధన్యవాదాలు తెలిపారు. కరోనా సంక్షోభంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. మహిళా సంఘాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సీఎం నిధులు విడుదల చేశారన్నారు.
మహిళా సంఘాలకు గతంలో ఎన్నడూ లేనివిధంగా పెద్దఎత్తున రుణాలు అందిస్తున్నామని ఎర్రబెల్లి తెలిపారు. మహిళా శక్తిని గుర్తించిన సీఎం కేసీఆర్.. వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ వడ్డీ లేని రుణాల కోసం ప్రస్తుత బడ్జెట్‌లో రూ.1,698 కోట్లు కేటాయించారని వివరించారు.
నెరవేరిన లక్ష్యం..
రాష్ట్రంలో తొలిసారిగా మహిళా స్వయం సహాయక బృందాలకు రుణలక్ష్యం నెరవేరింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) పరిధిలోని 2.71 లక్షల సంఘాలకు బ్యాంకుల ద్వారా 2020-21 ఏడాదిలో మార్చి 31 నాటికి రూ.10,431 కోట్ల రుణాల పంపిణీ పూర్తయింది. కరోనా కాలంలోనూ గ్రామీణ మహిళలు 98 శాతం రుణాలను తిరిగి చెల్లించారు. రాష్ట్రంలో 4.3 లక్షల మహిళా సంఘాలున్నాయి. వీటి పరిధిలో 46 లక్షల మంది సభ్యులు ఉన్నారు.