తెలంగాణ

telangana

ETV Bharat / state

కేజీహెచ్‌లో మృతుల బంధువుల ఆవేదన..

ఏపీ విశాఖ కేజీహెచ్‌ కొవిడ్‌ వార్డులో చికిత్స పొందుతూ చనిపోయిన వారి మృతదేహాలను బంధువులకు అప్పగించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మృతులకు సంబంధించిన వస్తువులు తిరిగి ఇవ్వడంలోనూ సిబ్బంది సరిగా స్పందించడం లేదని వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. శవాలను ఆలస్యంగా అప్పగించడంతో అంత్యక్రియల్లో కనీస సంస్కారాలు చేయలేకపోతున్నారు.

Relatives of the deceased protest in vishaka kgh
కేజీహెచ్‌లో మృతుల బంధువుల ఆవేదన..

By

Published : May 13, 2021, 12:10 PM IST

ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ రైల్వే ఉద్యోగి మంగళవారం మధ్యాహ్నం కొవిడ్‌ వార్డులో చనిపోయారు. మృతదేహాన్ని బుధవారం ఉదయం అప్పగించారు. మృతునికి సంబంధించిన బ్యాగ్‌ వెనక్కిరాలేదు. అందులో విలువైన పత్రాలున్నాయని కుటుంబీకులు ఆసుపత్రి సిబ్బందిని అడిగితే.. నర్సులను అడగాలని సమాధానమిచ్చారు.

గుర్తు పట్టలేని స్థితికి చేరాక..

కొవిడ్‌ వార్డులో రోజూ సుమారు 20 నుంచి 25 మంది కన్నుమూస్తున్నట్లు చెబుతున్నారు. ఆయా మృతదేహాలను వార్డు లోపల గంటల తరబడి ఉంచేస్తున్నారు. కవర్లలో ప్యాక్‌ చేసి మృతదేహాన్ని అప్పగిస్తే జీవీఎంసీ ఆధ్వర్యంలో అంత్యక్రియలు పూర్తిచేయాల్సి ఉంటుంది. కొన్ని మృతదేహాలను రాత్రుల్లో శవాగారానికి తరలించి వరండాలో పడేస్తున్నారు. కేజీహెచ్‌ ఆవరణలోని శవాగారం మృతదేహాలతో నిండిపోయి దుర్వాసన వ్యాపిస్తోంది. కుటుంబీకులు సైతం తమవారి పార్థివదేహాలను గుర్తుపట్టడం కష్టంగా మారుతోందని వాపోతున్నారు. అసలే కరోనాతో మరణించిన వారు కావడంతో ఎక్కువ సేపు పరిశీలించడమూ ఇబ్బందిగా మారింది.

500 పడకలతో విస్తరించిన కేజీహెచ్‌ కొవిడ్‌ వార్డు నిర్వహణ, వైద్యసేవలపై పలు ఆరోపణలున్నాయి. ఇప్పటికే ముగ్గురు బాధితులు ఇక్కడ పైఅంతస్తులో నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వైద్య సేవలు మెరుగుపర్చాలని, చనిపోయిన వారి మృతదేహాల అప్పగింతలో మానవత్వం ప్రదర్శించాలని, వాటిని ఎక్కడ భద్రపర్చిందీ తెలియజేయాలని బాధితులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:లాక్​డౌన్​ 2.0: రవాణా శాఖ స్లాట్ల బదలాయింపు

ABOUT THE AUTHOR

...view details