75గజాల్లోపు స్థలానికి నిమిషాల వ్యవధిలో, ఒక రూపాయి టోకెన్ రుసుముతో నిర్మాణ అనుమతి పొందే వెసులుబాటు కల్పించింది. అక్కడి నుంచి 500చ.మీ విస్తీర్ణంలో చేపట్టే నిర్మాణాలకూ సత్వర అనుమతులు ఇస్తోంది. నిర్మాణ అనుమతి అర్జీలు గతంతో పోలిస్తే బాగా పెరిగాయి. ఇదే సమయంలో తిరస్కరణలూ ఎక్కువే ఉంటున్నాయని అధికారులు అంటున్నారు. సత్వర అనుమతులు ఇచ్చాక 21 రోజుల్లోపు అధికారులు చేపట్టే తదుపరి పరిశీలన ప్రక్రియ అందుకు సాక్ష్యమవుతోంది.
పరిశీలనలో అన్నీ సవ్యంగా ఉన్నాయని భావిస్తే అధికారులు తుది అనుమతి మంజూరు చేస్తున్నారు. లేదంటే ఇచ్చిన సత్వర అనుమతిని రద్దు చేసి నిర్మాణాన్ని కూల్చేస్తున్నారు. సరైన దస్త్రాలు లేకపోవడం, దరఖాస్తులో పేర్కొన్న స్థలానికి, క్షేత్రస్థాయిలో భూమికి వ్యత్యాసం ఉండటం, రోడ్డు ముఖం తక్కువగా ఉండటం, వివాదాస్పద భూములకు దరఖాస్తు చేయడం, ఇతరత్రా కారణాలతో అనుమతుల భారీగా రద్దవుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. నిబంధనల విషయంలో టీఎస్‌బీపాస్ గందరగోళం సృష్టిస్తోందని ప్రజలు విమర్శిస్తున్నారు.
టీఎస్‌బీపాస్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఇంటి అనుమతి వస్తుందనుకుంటే పొరపాటే. ఇలా అర్జీ పెట్టి, అలా ఇల్లు కట్టుకోవచ్చనే ఉద్దేశంతో చాలా మంది మొక్కుబడిగా దరఖాస్తు చేసుకుంటున్నారు. మాదాపూర్, గచ్చిబౌలి, గురుకుల్‌సొసైటీ, ఖాజాగూడ, లింగంపల్లి, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లోని నిషేధిత సర్వే నంబర్ల నుంచి భారీ ఎత్తున సత్వర అనుమతుల కోసం అర్జీలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.