KCR Announcement Regular Scale Of VRAs : వీఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడం ద్వారా వారికి రెగ్యులర్ స్కేల్ వచ్చేలా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లోపు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్న అనంతరం వీఆర్ఏ ఐకాస ప్రతినిధులతో సీఎం చర్చలు జరిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసేదే పేద ప్రజల కోసమన్న కేసీఆర్.. చిరుద్యోగులైన వీఆర్ఏల సమస్యలను మానవత్వంతో వెంటనే పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు పేర్కొన్నారు. సుమారు 20 వేల మంది వీఆర్ఏల్లో ముందు మెడికల్ ఇన్ వ్యాలిడేషన్ ప్రకారం అర్హులై దరఖాస్తు చేసుకున్న వారి వారసుల వివరాలు, విద్యార్హతలు సేకరించాలని అధికారులకు సూచించారు.
విద్యార్హతల ప్రకారం వారికి నచ్చిన శాఖలు : మిగతా వారిని వారి అర్హతల ఆధారంగా పురపాలక, నీటిపారుదల, రెవెన్యూ, జిల్లా పరిషత్, విద్యాశాఖ, వైద్యకళాశాలలు, మిషన్ భగీరథ తదితర అవసరమైన చోట వేతనస్కేలు ఇస్తూ సర్దుబాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తదుపరి పదోన్నతలు కూడా వచ్చేలా చూడాలని చెప్పారు. వీఆర్ఏలు సమాచారం ఇవ్వడంతో పాటు అన్ని విషయాల్లో సమన్వయం చేయాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డికి సూచించారు.