జులై నుంచే ధరణి సేవలు...! రెవెన్యూ శాఖలోని పలు భూ సంబంధ విభాగాలను ఒకే గొడుగు కిందకు తేచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. భూ దస్త్రాల్లో మార్పులు చేర్పులు చేయాలంటే దానికి సంబంధించిన అధికారులను బాధ్యులు చేసేలా ఇప్పటికే బయోమెట్రిక్ విధానాన్ని తెచ్చింది. ‘ధరణి’ వేదికగా ఒకేచోట భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, టైటిల్ జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. భూమిపై యజమానికి పూర్తిస్థాయి హక్కులు కల్పించేందుకు భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రభుత్వం పూర్తిచేసింది. గతంలో ‘మా భూమి’ వేదికగా కొనసాగిన ఆన్‌లైన్ దస్త్రాల నిర్వహణను ధరణి పోర్టల్ ఏర్పాటు చేసి బదిలీ చేసింది.
సాంకేతికత వినియోగంతో...
ఒక భూ దస్త్రంలో మార్పు చేయాలంటే తహసీల్దారు నుంచి ఆర్డీవో, సంయుక్త కలెక్టర్ వరకు బయోమెట్రిక్‌తో మాత్రమే తెరిచేలా సాంకేతికతను జోడించింది ప్రభుత్వం. 72 లక్షల భూ ఖాతాల్లో ఇప్పటికే 54 లక్షల వ్యవసాయ ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానం చేసి పక్కా సాంకేతికతో కూడిన పాస్‌పుస్తకాలు జారీచేశారు. పహాణీలోనూ మార్పులు చేశారు. యజమానికే భూమిపై సర్వ హక్కులు కల్పించారు. సాగుదారు గడిని తొలగించారు.
జులై నుంచే ధరణి సేవలు...!
ఈ మార్పులన్నీ కొలిక్కి చేరుకున్నాక జూన్ లేదా జులై నుంచి ధరణి సేవలను పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. బ్లాక్‌చైన్ విధానంలో భూ దస్త్రంలో మార్పు చోటుచేసుకున్న వెంటనే భూ యజమాని సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సమాచారం వెళ్తుంది. గ్రామీణ భూములే కాక పట్టణ ప్రాంతాల్లోని భూములకు కూడా జీపీఎస్ ఆధారంగా భూమి హక్కును జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది.
ఇవీ చూడండి:దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు: కేసీఆర్