తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏప్రిల్​ నెలలో ఏ టెలికాం కంపెనీకు లాభం? ఎవరికి నష్టం?

లాక్​డౌన్​ సమయంలో దేశవ్యాప్తంగా ఏప్రిల్​ నెలలో 85 లక్షలకు పైగా.. మొబైల్​, ల్యాండ్​లైన్​ వినియోగదారుల సంఖ్య తగ్గినట్లు ట్రాయ్​ వెల్లడించింది. పట్టణ, నగర ప్రాంతాల్లో 1.41శాతం వినియోగదారుల సంఖ్య తగ్గగా... గ్రామీణ ప్రాంతాల్లో 0.14శాతం వాడకదారుల సంఖ్య పెరిగినట్లు ప్రకటించింది. మొబైల్‌, ల్యాండ్‌లైన్‌, బ్రాండ్‌బ్రాండ్‌ మూడు విభాగాల్లోనూ రిలయన్స్‌ జియో చందాదారుల సంఖ్య భారీగా పెరగ్గా... మిగిలిన ప్రైవేటు, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థల వినియోగదారులు తగ్గినట్లు ట్రాయ్‌ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

reduced-number-of-mobile-landline-users-in-april-month-says-trai
ఏప్రిల్​ నెలలో ఏ టెలికాం కంపెనీకు లాభం? ఎవరికి నష్టం?

By

Published : Jul 25, 2020, 5:46 PM IST

కొవిడ్‌ ప్రభావం టెలికాం వినియోగదారులపైనా పడింది. ఏప్రిల్‌ నెలలో మొబైల్‌, ల్యాండ్‌లైన్‌ వాడకం వినియోగదారుల సంఖ్య తగ్గినట్లు టెలికం రెగ్యులేటరీ అథారిటి ఆఫ్‌ ఇండియా-ట్రాయ్‌ వెల్లడించింది. అంటే కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా దేశ వ్యాప్తంగా అమలు చేసిన లాక్‌ డౌన్‌ సమయంలో ఈ తగ్గుదల నమోదవడంతో కరోనా ప్రభావం పడినట్లు చెప్పవచ్చు. ఈ ఏడాది మార్చి నాటికి 117. 79 కోట్లుగా ఉన్న టెలికాం వినియోగదారులు ఏప్రిల్‌ చివరి నాటికి 116.94 కోట్లుకు తగ్గినట్లు ట్రాయ్‌ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

వివరాలిలా...

పట్టణ ప్రాంతంలో మార్చి చివరి నాటికి 65.64 కోట్లుగా ఉన్న వినియోగదారులు ఏప్రిల్‌ 30 నాటికి 64.71కోట్లకు సంఖ్య తగ్గింది. అదే విధంగా గ్రామీణ ప్రాంతంలో 52.15 కోట్లుగా ఉన్న వాడకదారుల సంఖ్య 52.24 కోట్లకు ఎగబాకింది. అంటే ఏప్రిల్‌ నెలలో పట్టణ ప్రాంతంలో 1.41శాతం తగ్గగా... గ్రామీణ ప్రాంతంలో 0.14శాతం వినియోగదారులు పెరిగారు.

2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే ఈ ఏడాది ఏప్రిల్‌ 30 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 44.66శాతం, పట్టణ, నగరాల్లో 55.34శాతం వినియోగదారుల సాంద్రత ఉన్నట్లు వెల్లడించింది. 2019 ఏప్రిల్‌ నుంచి 2020 ఏప్రిల్‌ వరకు తీసుకుంటే ల్యాండ్‌లైన్‌ విభాగంలో ఏకంగా 7.23శాతం, మొబైల్‌ విభాగంలో 1.10శాతం వినియోగదారులు తగ్గినట్లు ట్రాయ్‌ స్పష్టం చేసింది.

దేశ వ్యాప్తంగా మొబైల్‌ వినియోగదారులు ఈ ఏడాది మార్చి నాటికి 115.77 కోట్లు మంది ఉండగా ఏప్రిల్‌ 30నాటికి 114.95 కోట్లకు తగ్గారు. సగటున ఏప్రిల్‌ నెలలో 0.71శాతం మొబైల్‌ వాడకందార్లు తగ్గారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల వారీగా పరిశీలించినట్లయితే పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది మార్చి చివర నాటికి 63.84 కోట్లు వాడకదారులు ఉండగా ఏప్రిల్‌ చివరకు 62.94 కోట్లకు తగ్గారు.

అదే గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటే 51.92 కోట్లు మంది ఉండగా ఏప్రిల్‌ చివరకు 52 కోట్లకు సంఖ్య ఎగబాకింది. అంటే ఏప్రిల్‌ నెలలో పట్టణ ప్రాంతాల్లో 1.42శాతం తగ్గగా, గ్రామీణ ప్రాంతాల్లో 0.16శాతం పెరిగారు.

మార్చి చివరి నాటికి...

మొత్తం మొబైల్‌ చందాదారుల్లో 85.43శాతం మంది అంటే 95.78 కోట్లు మంది మొబైల్‌ కనెక్షన్లు వినియోగంలో ఉన్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది మార్చి చివర నాటికి మొత్తం 2.02 కోట్లు మంది ల్యాండ్‌లైన్‌ వాడకదారులు ఉండగా ఏప్రిల్‌ 30కి 1.99కోట్లకు తగ్గారు. ఇందులో దాదాపు 90శాతం పట్టణ ప్రాంతాల్లో, పదిశాతానికిపైగా గ్రామీణ ప్రాంతాల్లో వాడకం దారులు ఉన్నట్లు వెల్లడించింది.

టెలికాం ఆపరేటర్ల వారీగా దేశంలో ఏయే ఆపరేటర్లకు ఎంత శాతం వాటా ఉంది. ఎవరి వాడకందారులు పెరుగుతున్నారు. ఎవరి వినియోగదారులు తగ్గుతున్నారు తదితరవి పరిశీలించినట్లయితే.. ఒక్క రిలయన్స్‌ జియో ఆపరేటర్‌ చందాదారులు పెరగడంతోపాటు... దాని వాటా సైతం పెరుగుతోంది. మిగిలిన ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల ఆపరేటర్లకు చెందిన చందాదారులు తగ్గిపోయారు. ఏప్రిల్‌ నెలలో ఆపరేటర్ల వారీగా తీసుకుంటే రిలియన్స్‌ వాడకందార్లు 15.75లక్షల మంది పెరగ్గా, బిఎస్‌ఎన్‌ఎల్‌ 20వేలు, వొడాఫోన్‌ ఐడియా 45.16లక్షలు, ఎయిర్‌టెల్‌ 52.70లక్షలు లెక్కన తగ్గారు.

అదే విధంగా ఏప్రిల్‌ చివరినాటికి ఆపరేటర్ల వారీగా వాటాలు పరిశీలిస్తే... రిలయన్స్‌ జియో 33.85శాతం, ఆ తరువాత స్థానంలో 28.06శాతంతో భారతి ఎయిర్​టెల్‌, మూడో స్థానంలో వొడాఫోన్‌, ఐడియా 27.37శాతం, బీఎస్‌ఎన్‌ఎల్‌ 10.43శాతం, ఎంటీఎన్‌ఎల్‌ 0.29శాతం లెక్కన ఉన్నాయి.

అదే విదంగా ల్యాండ్‌ లైన్‌ చందాదారులు ఏప్రిల్‌ నెలలో రిలయన్స్‌ జియో యాభైవేలకుపైగా పెరగ్గా, భారతి ఎయిర్‌టెల్‌ 77వేలకుపైగా, వొడోఫోన్‌, ఐడియా 22వేలకుపైగా, బీఎస్‌ఎన్‌ఎల్‌ 2.37లక్షలకుపైగా వాడకందారులు తగ్గినట్లు ట్రాయ్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ల్యాండ్‌లైన్‌ ఆపరేటర్ల వాటాలు తీసుకుంటే... ప్రభుత్వ రంగ సంస్థలు అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ల వాటా 58.14శాతం ఉండగా మిగిలిన 41.86శాతం ప్రైవేటు ఆపరేటర్ల వాటా ఉంది.

బ్రాడ్‌బ్రాండ్‌ విభాగం తీసుకుంటే.. మొబైల్‌, ల్యాండ్‌లైన్‌, డోంగిల్స్‌ తదితర వాటి ద్వారా డేటా వాడకందారులు మొత్తం 68.74కోట్లు మంది మార్చినాటికి ఉండగా అది ఏప్రిల్‌ 30వ తేదీకి 1.64శాతం తగ్గి... 67.61కోట్లకు సంఖ్య పడిపోయింది. అయిదుగురు ఆపరేటర్లు 98.98 శాతం మార్కెట్‌ను విస్తరించినట్లు ట్రాయ్‌ వెల్లడించింది.

ఏప్రిల్​ చివర నాటికి ఇలా..

ఈ ఏడాది ఏప్రిల్‌ చివర నాటికి రిలయన్స్‌ జియో 38.99కోట్లు, భారతి ఎయిర్‌టెల్‌ 14.47కోట్లు, వొడాఫోన్‌, ఐడియా 11.13కోట్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌ 2.15 కోట్లు, ఆత్రియ కన్వెర్జన్స్‌ దాదాపు 16లక్షలు బ్రాడ్‌బ్రాండ్‌ కనెక్షన్లు ఉన్నట్లు వివరించింది. ఇందులో వాటాలను పరిశీలిస్తే మొత్తం కనెక్షన్లల్లో సింహభాగం రిలయన్స్‌ జియో 57.68శాతం ఉండగా, భారతి ఎయిర్‌టెల్‌ 21.41శాతం, వొడాఫోన్‌ ఐడియా 16.47శాతం,ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ వాటా కేవలం 3.19శాతంగా ఉన్నట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి:దక్షిణ భారతంలో ఐసిస్​ ఉగ్రవాదుల అలికిడి

ABOUT THE AUTHOR

...view details