దేశంలో గడిచిన 9నెలల్లో వచ్చిన జీఎస్టీ రాబడులను పరిశీలిస్తే... సెప్టెంబర్, అక్టోబర్ నెలలు మినహా అన్ని నెలల్లోనూ 2018 ఏడాది కంటే.. 2019లో అధిక ఆదాయం వచ్చింది. 2018 ఏప్రిల్‌లో 1,03,459 కోట్లు రాగా... 2019లో ఏప్రిల్‌లో రూ 1,13,865 కోట్లు రాబడి వచ్చింది.
గణాంకాలిలా...!
2019లో ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు వచ్చిన రాబడులను చూస్తే... మే, జులై, నవంబరు, డిసెంబరు నెలల్లో ప్రతి నెలా లక్ష కోట్లుకుపైగా ఆదాయం రాగా జూన్, ఆగస్టు, నెలల్లో... లక్ష కోట్లు లోపలే వచ్చింది. 2019 నవంబరు, డిసెంబరు నెలల్లో దేశ వ్యాప్తంగా జీఎస్టీ రాబడులు పెరిగి కాస్త ఊరటనిచ్చాయి. మొత్తం జీఎస్టీ రాబడులు లక్షా మూడు వేల కోట్లు కాగా కేంద్ర జీఎస్టీ కింద రూ.19,962 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ కింద రూ.26792 కోట్లు, ఎగుమతులు, దిగుమతులు, కేంద్ర సెస్‌లతో కలిసి రూ. 30,473 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.17,626 కోట్లు లెక్కన ఆదాయం వచ్చినట్లు ఆర్థిక శాఖ గణాంకాలు వెల్లడించింది.
2018 డిసెంబరులో రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన రాబడులతో పోలిస్తే 2019లో ఆశించిన మేరకు ఆదాయం రాలేదు. అదే విధంగా దేశ వ్యాప్తంగా 37 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వచ్చిన రాబడులను పరిశీలిస్తే...జాతీయ సగటు వృద్ధి 16శాతంగా ఉంది. లక్షద్వీప్‌లో 78శాతం, జార్ఖండ్‌లో మూడు శాతం రాబడులు 2018లో కంటే పడిపోయాయి.
అరుణాచల్ ప్రదేశ్‌లో 124శాతం, నాగాల్యాండ్ 88శాతం, మణిపూర్ 64శాతం, మిజోరం 60శాతం, సిక్కిం 43శాతం, జమ్ము కశ్మీర్ 40శాతం, అస్సాం 33శాతం లెక్కన 2018 డిసెంబరు రాబడుల కంటే అధికంగా వచ్చి వృద్ధి నమోదు చేశాయి. మహారాష్ట్రంలో 22శాతం వృద్ధి కనపరచగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణాలో 13శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 11శాతం లెక్కన వృద్ధి కనపడింది. తెలంగాణ రాష్ట్రంలో 2018 డిసెంబరులో రూ.3014 కోట్లు రాగా 2019లో అది రూ.3420 కోట్లుకు పెరిగింది. అదే ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రంలో 2018 డిసెంబరులో 2049 కోట్లు రాగా అదే 2019లో రూ.2265 కోట్లు ప్రకారం ఆదాయం వచ్చింది.
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా రెండు రాష్ట్రాల్లో కూడా 14శాతం వృద్ధి నమోదు కానందున....కేంద్ర ప్రభుత్వం నుంచి తగ్గిన లోటు పూడ్చేందుకు ఇరు రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం వస్తుందని అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: పురపోరుకు విడుదలైన ఓటర్ల తుది జాబితా ఇదే...