Genome sequencing reduced: కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. చైనాలో కొవిడ్ కేసులు పెరగడం, అక్కడ వ్యాప్తికి కారణమైన ఒమిక్రాన్ ఉపరకం బీఎఫ్-7 కేసులు భారత్‌లోనూ మూడు నమోదవడంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ప్రజల్లోనూ ఒకింత ఆందోళన మొదలైంది. ప్రస్తుతానికి కేసులు పెద్దగా నమోదు కాకపోయినా.. వ్యాప్తిని ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు సరైన నిఘా అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్త వేరియంట్‌ను గుర్తించేందుకు వచ్చిన నమూనాలను ఎప్పటికప్పుడు జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాల్సి ఉంటుంది.
తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే కొవిడ్ నమూనాల జన్యు పరీక్షలు ప్రస్తుతం సీడీఎఫ్‌డీలో జరుగుతున్నాయి. పాజిటివ్ కేసులు తగ్గిపోవడంతో ఆ మేరకు సీక్వెన్సింగ్ తగ్గించారు. కొవిడ్ నిఘా కోసం దేశంలోని 54 సంస్థల భాగస్వామ్యంతో జీనోమ్ కన్సార్టియం ఇన్సాకాగ్ ఏర్పడింది. తెలంగాణలో సీడీఎఫ్‌డీ, సీసీఎంబీ, గాంధీ ఆసుపత్రి ఇందులో ఉన్నాయి. తక్కువ కేసులు వస్తుండడంతో కొంతకాలంగా సీడీఎఫ్‌డీలో వాటి నమూనాలను పరీక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని కొంత ప్రాంతం, తదితర చోట్ల నుంచి కొవిడ్ కేసుల నమూనాలు ఇటీవల వరకు సీసీఎంబీకి వచ్చేవి. ఇప్పుడు ఎక్కడికక్కడ స్థానికంగా జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నారు.