TS REDCO EV Charging Stations: హైదరాబాద్‌లో రవాణా, వ్యక్తిగత వాహనాల వాడకంతో ఏర్పడుతున్న కాలుష్యంపై... బ్రిటన్ ప్రభుత్వం, నీతి ఆయోగ్‌తో కలసి రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ-రెడ్కో ఇటీవల అధ్యయనం చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాల్సిన ఆవశ్యకతను నివేదికలో వివరించారు. హైదరాబాద్‌లో నిత్యం ప్రయాణిస్తున్నవారిలో 47.8శాతం మంది వ్యక్తిగత వాహనాలు వినియోగిస్తున్నారు. నగరంలో 2000 సంవత్సరంలో 7లక్షల వ్యక్తిగత వాహనాలుంటే 2020 నాటికి 53 లక్షలకు చేరాయి. రోజుకు కొత్తగా 1,200 వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. వీటివల్ల హైదరాబాద్‌లో భారీగా బొగ్గు పులుసు వాయువు గాలిలోకి చేరుతోంది. కాలుష్యాన్ని తగ్గించాలంటే ఈవీ వాహనాలను ప్రోత్సహించాలని రెడ్కో నిర్ణయించింది.
ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరగనుంది. ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను గణనీయంగా పెంచాలని రెడ్కో నిర్ణయించింది. త్వరలో 138 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణకు ఫేమ్-2లో భాగంగా 138 ఈవీ చార్జింగ్ కేంద్రాలను కేటాయించింది. అందులో హైదరాబాద్‌లో 118, కరీంనగర్‌లో 10, వరంగల్‌లో 10 ఏర్పాటు చేయనున్నట్లు రెడ్కో తెలిపింది. ఇప్పుడు జీహెచ్ఎంసీతో జతకట్టి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 14 చోట్ల కార్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సంకల్పించింది.
ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహమివ్వడంతో ఇటీవల భారీగా కొనుగోళ్లు పెరిగాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో సుమారు 8వేల 600 వరకు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు జరిగినట్లు రవాణాశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచేందుకు అధికారులు దృష్టిసారించారు. ఇప్పటికే ఈఎస్ఎల్ 49, ఎన్టీపీసీ 32, ఆర్ఈఐఎల్ 37ఛార్జింగ్ స్టేషన్లు పెట్టేందుకు పరిశ్రమలశాఖ నుంచి అనుమతులు పొందాయి. మూడు నాలుగు నెలల్లో ఆ పనులు పూర్తవుతాయని రెడ్కో వెల్లడించింది. ఛార్జింగ్ స్టేషన్లలో ఒక్కో యూనిట్‌కు 12 రూపాయల 06 పైసలు, అదనంగా జీఎస్టీ వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లలోనే సుమారు వెయ్యి ప్రాంతాల్లో ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ఛార్జింగ్ స్టేషన్లు పూర్తయితే రహదారులపై ఇక ఎలక్ట్రిక్ వాహనాలు రయ్ మంటూ పరుగులు పెట్టనున్నాయి.