Recykal company in Hyderabad : ప్లాస్టిక్ బాటిళ్లు పోగుపడకుండా సరికొత్త ఆలోచన చేసింది హైదరాబాద్ నగరానికి చెందిన రీసైకల్ అనే సంస్థ. ఉత్తరాఖండ్ కేదార్‌నాథ్‌లో చేసిన ఈ ప్రయోగానికి సంస్థ ‘డిజిటల్ ఇనిషియేటివ్స్ ఇన్ కొలాబరేటింగ్ విత్ స్టార్టప్స్’ విభాగంలో ‘డిజిటల్ ఇండియా అవార్డు’ లభించింది. దిల్లీలో శనివారం అవార్డుల ప్రదానోత్సవం జరగనుండగా.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ సంస్థ అవార్డును అందుకోబోతున్నారు.
1,63,000 బాటిళ్లు.. కేదార్‌నాథ్ వెళ్లే ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం అది. 50కిలోమీటర్ల దారిపొడవునా దుకాణాల్లో శీతలపానీయాలు, నీళ్లసీసాలు పోగుపడిపోయి ఉన్నాయి. దీనికి చెక్ పెట్టాలంటూ అక్కడి జిల్లా పాలనా విభాగం.. నగరానికి చెందిన రీసైకల్ సంస్థను సంప్రదించింది. ఈ క్రమంలోనే ‘డిజిటల్ డిపాజిట్ రీఫండ్ సిస్టమ్’(డీడీఆర్‌ఎస్) ఆలోచనకు శ్రీకారం చుట్టి సుమారు 1,63,000 ప్లాస్టిక్ బాటిళ్లు సేకరించి రికార్డు సృష్టించారు.