Hyderabad Rains Today :హైదరాబాద్ మహానగరాన్ని అకాల వర్షం చిగురుటాకులా వణికించింది. ఈదురు గాలులు, పిడుగులకు.. భాగ్యనగరవాసులు భయ కంపితులయ్యారు. 2 గంటల్లోనే 8 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. రామచంద్రాపురంలో అత్యధికంగా 7.98 సెంటీమీటర్లు.. గచ్చిబౌలిలో 7.75 సెంటీమీటర్ల వాన పడింది. నడి వేసవిలో ఇంత భారీ వర్షం పడటం ఇదే మొదటిసారి. 2015 ఏప్రిల్ 12న అత్యధికంగా 6.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఈ రికార్డు తాజా వానలతో తుడిచి పెట్టుకుపోయింది. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు నగరవాసులను భయపెట్టాయి.
Heavy Rain in Hyderabad :గాలుల తీవ్రతతో విద్యుత్ స్తంభాలు, చెట్లు, హోర్డింగ్‌లు విరిగి పడ్డాయి. రాంనగర్ నుంచి అచిత్ రెడ్డి మార్క్‌కు వెళ్లే దారిలో ఉన్న చెట్లు నేలకొరిగాయి. ఓ చెట్టు కారుపై పడడంతో వాహనం దెబ్బతిన్నది. వర్షానికి నేలకొరిగిన చెట్లను జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది తొలగించారు. పలు ప్రాంతాలు విద్యుత్ సరఫరా నిలిచి అంధకారంలోకి వెళ్లిపోయాయి. మెట్రో జోన్‌లో 89 ఫీడర్లు ట్రిప్ అయ్యాయి. 22 ఫీడర్లను సిబ్బంది పునరుద్ధరించారు. క్షేత్రస్థాయిలో పని చేసే ఆర్టిజన్లు సమ్మెలో ఉండటంతో సరఫరా పునరుద్ధరణలో సమస్యలు తలెత్తాయి. భారీ వర్షాలతో రహ్మత్‌నగర్‌లో డివిజన్ ఎస్పీఆర్‌హిల్స్ ఓంనగర్‌లో గోడకూలి 8నెలల చిన్నారి జీవనిక మృత్యువాతపడింది.
నగరంలో కొన్ని ప్రాంతాలు జలమయం : బేగం బజార్, కోఠి, సుల్తాన్ బజార్ , అబిడ్స్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. బషీర్ బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, లక్డీకాపూల్ ప్రాంతాలలో రహదారులు జలమయ్యాయి. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ రాయదుర్గం ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షం దంచికొట్టింది. చందానగర్, ముంబయి జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరి రాకపోకలకు అంతరాయం కలిగింది. లింగంపల్లి రైల్వే అండర్ పాస్ పూర్తిగా వరద నీటితో మునిగి పోయింది. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వెళ్లే వాహనాలను మియాపూర్ వైపు ట్రాఫిక్ పోలీసులు మళ్లించారు.