తెలంగాణ

telangana

ETV Bharat / state

GST: వస్తు సేవల పన్ను వసూళ్లలో 33శాతం వృద్ధి - తెలంగాణ వార్తలు

దేశంలో జులై నెలలో వస్తు సేవల పన్ను(GST) రాబడులు రూ.లక్ష కోట్లు దాటాయి. జూన్‌లో రూ.92,849 కోట్లు రాగా... జులైలో ఏకంగా రూ.1,16,393 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాదితో పోల్చితే 33శాతానికిపైగా వృద్ధి నమోదైంది. రూ.28శాతం వృద్ధితో తెలంగాణ రూ.3,610 కోట్లు, 28శాతం వృద్ధితో ఆంధ్రప్రదేశ్‌ రూ.2,730 కోట్ల మేర జీఎస్టీ రాబడులు వచ్చినట్లు కేంద్రం వెల్లడించింది.

gst collections, july month gst collections
జీఎస్టీ వసూళ్లు, జులైలో జీఎస్టీ రాబడులు

By

Published : Aug 2, 2021, 3:58 PM IST

దేశంలో మొదటి దశ కరోనా ప్రభావంతో 2020-21 ఆర్థిక సంవత్సరంపై తీవ్రంగా చూపగా... జీఎస్టీ(GST) వసూళ్లు పడిపోయాయి. కానీ ఈ ఆర్థిక సంవత్సరం కరోనా రెండో దశ ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలతో ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందింది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా స్తంభించకుండా రెండు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకున్నాయి. జులై నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ రాబడులు వచ్చాయని కేంద్రం ప్రకటించింది.

వృద్ధి నమోదు

2020 ఆర్థిక సంవత్సరం జులై నెలలో రూ.87,422 కోట్లు రాగా... ఈ ఏడాది 1,16,393 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాలు విడుదల చేసింది. గతేడాది జులైలో వచ్చిన రూ.87,422 కోట్లతో పోలిస్తే 33శాతానికిపైగా వృద్ధి నమోదు చేసింది. వరుసగా ఎనిమిది నెలల పాటు రూ.లక్ష కోట్లకుపైగా వసూళ్లు నమోదై ఈ ఏడాది జూన్‌లో మాత్రమే రూ.92,849 కోట్లకు పడిపోయింది.

గత నెలలో వసూలైన వస్తు సేవల పన్ను వివరాలు

  • కేంద్ర జీఎస్టీ- రూ.22,197 కోట్లు
  • రాష్ట్ర జీఎస్టీ- రూ.28,541 కోట్లు
  • దిగుమతులు- రూ.27,900 కోట్లు
  • పన్నులు, సెస్సులు రూ.7,790 కోట్లు

మొత్తం కలిపి ఐజీఎస్టీ కింద రూ.57,864 కోట్లు రాబడి వచ్చింది. రెగ్యులర్‌ సెటిల్‌మెంట్‌ కింద ఐజీఎస్టీ నుంచి సీజీఎస్టీ ఖాతాకు రూ.28,087 కోట్లు, ఎస్‌జీఎస్టీకి రూ.24,100 కోట్లను ప్రభుత్వం సర్దుబాటు చేసింది. ఐజీఎస్టీ మొత్తాన్ని సర్దుబాటు చేసిన తర్వాత జులైలో కేంద్రానికి సీజీఎస్టీ కింద రూ.50,284 కోట్లు, రాష్ట్రాలకు ఎస్‌జీఎస్టీ కింద రూ.52,641 కోట్లు లెక్కన రాబడులు వచ్చాయి.

తెలుగు రాష్ట్రాలు భేష్

రాష్ట్రాల వారీగా జులై నెలలో జీఎస్టీ వసూళ్లను పరిశీలిస్తే గతేడాది జులైలో వచ్చిన మొత్తాల కంటే దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ వసూళ్లు పెరిగాయి. రాష్ట్రాల్లో ఝార్ఖండ్‌, ఒడిశాల్లో 54శాతం, మహారాష్ట్ర 51శాతం, దేశ రాజధాని దిల్లీ 45శాతం లెక్కన వృద్ధిని కనబరిచాయి. ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆశించిన స్థాయిలో వృద్ధిని కనబరిచినట్లు ఆర్థిక శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రూ.28శాతం వృద్ధితో తెలంగాణ రూ.3610 కోట్లు, 28శాతం వృద్ధితో ఆంధ్రప్రదేశ్‌ రూ.2730 కోట్లు మేర జీఎస్టీ రాబడులు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఇదీ చదవండి:vishakha steel plant: దేశ రాజధానిలో విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యమం

ABOUT THE AUTHOR

...view details