తెలంగాణ

telangana

ETV Bharat / state

flood prevention: రీఛార్జి వెల్స్‌ ఉత్తమమన్న జేఎన్‌టీయూ.. పట్టించుకోని బల్దియా.. - Motorists' troubles with Baldia negligence

వానాకాలం వచ్చింది.. ఏటా తరహాలోనే వరదలు ముంచెత్తుతున్నాయి. రహదారులపై నీరు నిలిచి వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌ వలయంలో చిక్కుకుని నానా అవస్థలు పడుతున్నారు. రహదారుల్లో వరద ముంపు నివారణ చర్యలకు నిపుణుల సూచనలు అమలుచేయడంలో బల్దియా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మూడేళ్ల కిందట జేఎన్‌టీయూ నగరవ్యాప్తంగా సర్వే చేసి వరద ముంపు నివారణకు రీఛార్జి వెల్స్‌ నిర్మించాలని సూచించినా.. బల్దియా పట్టించుకోలేదు. అరకొరగా పనులు చేసి పక్కన పెట్టేసింది.

recharge-wells-are-best-for-flood-prevention-in-hyderabad
రీఛార్జి వెల్స్‌ ఉత్తమమన్న జేఎన్‌టీయూ.. పట్టించుకోని బల్దియా..

By

Published : Jul 16, 2021, 10:11 AM IST

దక్కన్‌ పీఠభూమి ప్రాంతమైన హైదరాబాద్‌లో వరద ముంపునకు ప్రత్యేక కార్యాచరణ అవసరమని జేఎన్‌టీయూ అభిప్రాయపడింది. మూడేళ్ల కిందట భారీవర్షాలతో హైటెక్‌సిటీ ప్రాంతం అతలాకుతలమైంది. రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచి వాహనదారులు ఇబ్బందిపడ్డారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం నగరంలో వరదనీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేకంగా సర్వే చేయించింది. జేఎన్‌టీయూ వాటర్‌ రీసోర్స్‌ విభాగం ఆచార్యుడు ప్రొ.గిరిధర్‌ నేతృత్వంలోని బృందం నగరంలో వరద నీరు నిలిచే ప్రాంతాలపై సర్వే చేసింది. ఏటా నగరంలో 172 ప్రాంతాల్లో నీరు నిలుస్తున్నట్లు గుర్తించారు. వీటిల్లో అధికంగా నీరు నిలిచేవి, మధ్యస్థం, తక్కువగా నిలిచే ప్రాంతాలని మూడు కేటగిరీలుగా విభజించారు. భారీ వరద చేరే కేటగిరీ-ఎ ప్రాంతాలను 40 వరకు గుర్తించారు. అక్కడి పరిస్థితుల దృష్ట్యా ఇంకుడు గుంతలకు బదులుగా రీఛార్జి వెల్స్‌(ఇంజెక్షన్‌వెల్స్‌) నిర్మించాలని జేఎన్‌టీయూ నిపుణుల బృందం సూచించింది.

నిర్వహణ లేక..

రహదారులపై చెత్తాచెదారం, ప్లాస్టిక్‌ వ్యర్థాలు రీఛార్జి వెల్స్‌ను చుట్టుముడుతున్నాయి. ఏటా వర్షాకాలానికి ముందు మరమ్మతులు చేసి నీరు ఇంకేందుకు అనువుగా మార్చాల్సి ఉంది. నిర్వహణ సరిగా లేక ఇబ్బందిపడుతున్న పరిస్థితి. వరద నీరు అంచనా వేయకుండా ఎక్కువగా రీఛార్జి వెల్స్‌ నిర్మించకపోవడంతోనూ నీరు పారడం లేదు. రాజ్‌భవన్‌ రోడ్డులోని లేక్‌ వ్యూ అతిథి గృహం వద్ద మోకాలిలోతులో నీరు నిలుస్తోంది. రెండు రీఛార్జి వెల్స్‌ నిర్మించారు. వరదను పూర్తిస్థాయిలో మళ్లించాలంటే మరో రెండు అవసరం ఉంది. అవసరమైన మేరకు ఏర్పాటు చేయకపోవడంతో వరద సమస్యకు పరిష్కారం లభించడం లేదు.

మధ్యలోనే వదిలేసి..

జేఎన్‌టీయూ సూచనల అమలును బల్దియా మధ్యలోనే వదిలేసింది. కేవలం 20 ప్రాంతాల్లోనే రీఛార్జి వెల్స్‌ నిర్మించి మిగిలిన ప్రాంతాలను పట్టించుకోలేదు. అధికారులు బదిలీ కావడం, కరోనా ప్రబలడం, జీహెచ్‌ఎంసీ పాలకవర్గ ఎన్నికలు.. ఇలా వరుసగా వివిధ కారణాలతో పనులు ముందుకు సాగలేదు. దీంతో రీఛార్జి వెల్స్‌ కొన్ని ప్రాంతాలకే పరిమితమై.. రహదారులపై నీళ్లు నిలుస్తున్న పరిస్థితి.

సమస్య ఉన్న ప్రాంతాలు..

రాజ్‌భవన్‌రోడ్డు, బంజారాహిల్స్‌ రోడ్డు నం.12, బేగంపేట పైవంతెన, మాసాబ్‌ట్యాంకు, విజయనగర్‌కాలనీ, మెహిదీపట్నం, మలక్‌పేట రైల్వే వంతెన, చైతన్యపురి, బంజారాహిల్స్‌ ఠాణా, మాదాపూర్‌ ఐవోసీ పెట్రోల్‌ బంకు, శిల్పారామం ఎదురుగా, అయ్యప్పసొసైటీ నుంచి జేఎన్‌టీయూ వెళ్లే దారిలో వంతెన వద్ద, అయ్యప్ప సొసైటీలో వంద అడుగుల రోడ్డులోని రత్నదీప్‌-బాలాజీ మార్కెట్‌ వద్ద నీరు నిలుస్తోంది.

ఇదీ చూడండి:Surgery : విరిగింది ఓ కాలు.. సర్జరీ చేసింది మరో కాలికి

ABOUT THE AUTHOR

...view details