Bihar Worker Custody Death :హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల అదుపులో ఉన్న భవన నిర్మాణ కార్మికుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. బిహార్‌కు చెందిన నితీష్ నానక్‌రామ్‌గూడలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అక్కడి భద్రత సిబ్బందికి, ఇతర కార్మికులకు మధ్య గొడవ జరగడంతో.. వీరంతా రెండు బృందాలుగా విడిపోయి దాడులకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. దాడిలో గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.
అదుపులో ఉన్న మరో ముగ్గురిలో ఒకడైన నితీష్.. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు పోలీస్ కస్టడీలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశామని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. ఘటన పై సీపీ ఆదేశాల మేరకు విచారణ కూడా జరుగుతోందన్నారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు.. మిగతా నిందితుల నుంచి వివరాలు సేకరించారు. గచ్చిబౌలి సీఐ జేమ్స్ బాబుతో పాటు.. క్లస్టర్ ఎస్సై, కానిస్టేబుళ్లను ప్రశ్నించినట్లు తెలిపారు.
Previous Custody Death Issues :మెదక్‌లోనూ ఆర్నెళ్ల క్రితం పోలీస్ కస్టోడియల్ ఓ మరణం చోటుచేసుకుంది. గొలుసు దొంగతనం కేసులో మెదక్ జిల్లా పోలీసులు పాతబస్తీలో ఉన్న ఖదీర్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనపై తీవ్రంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి క్రూరంగా వ్యవహరించారని నడవలేని పరిస్థితిలో ఉన్నట్లు అతడు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. తీవ్ర అనారోగ్యం పాలైన ఖదీర్‌ను పోలీసులే తీసుకెళ్లి మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఖదీర్ మృతి చెందాడు.
lockup death: పెచ్చరిల్లుతున్న పోలీసు హింస... లాకప్ మరణాలకు అంతం లేదా?
పాత దొంగ ఖదీర్ పోలికలున్నాయని అనుమానించి అతడిని అదుపులోకి తీసుకెళ్లి ప్రశ్నించినట్లు,పోలీస్ కస్టోడియల్ డెత్‌గా రాజకీయ పార్టీలు ఆందోళన చేయడంతో డీజీపీ అంజనీ కుమార్ కామారెడ్డికి చెందిన పోలీస్ అధికారితో దర్యాప్తు చేయించారు. ఐజీ చంద్రశేఖర్ నేతృత్వంలో దర్యాప్తు చేశారు. సంబంధిత పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్సై, కానిస్టేబుల్ పైనా శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
గతంలో జరిగిన కస్టడీ మరణాలు :తుకారాంగేట్ పోలీస్ స్టేషన్లో ఏప్రిల్ నెలలో ఓ రిక్షా కార్మికుడు మృతి చెందాడు. పాత నేరస్థుడైన శ్రీకాంత్ అనే రిక్షా కార్మికుడిని సెల్ఫోన్ల దొంగతనం కేసులో తుకారాంగేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్లో అకస్మాత్తుగా శ్రీకాంత్ పడిపోవడంతో పోలీసులు వెంటనే గాంధీ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
సంచలనం సృష్టించిన మరియమ్మ మరణం :రాష్ట్రంలో అటువంటి మరో ఘటననేమరియమ్మ కస్టడీ మరణవార్తకూడా.. పోలీస్ కస్టడీలో చనిపోవడం పోలీస్‌శాఖపై సర్వత్రా విమర్శలకు దారి తీసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరు పీఎస్ ఘటనలో 2021 జూన్ 18న ఈ ఘటన చోటు చేసుకుంది. చర్చిలో 2 లక్షల రూపాయలు దొంగిలించారన్న ఫిర్యాదు మేరకు పోలీసులు మరియమ్మను, ఆమె కుమారుడు ఉదయ్ కుమార్‌తో పాటు.. మరొకరిని 2021 జూన్ 17వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన మరియమ్మను పోలీసులు భువనగిరి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సంచలనం సృష్టించిన ఈ ఘటనలో రాచకొండ సీపీ మహేష్ భగవత్, ఎస్సైతో పాటు హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.
అమలుకాని సుప్రీం ఆదేశాలు :పోలీసులు వేదిస్తున్నారంటూ పలువురు నిందితులు న్యాయస్థానాల ముందు గోడు వెల్లబోసుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఈ తరుణంలో ఇది వరకే సుప్రీంకోర్టు పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు కొడుతున్నారని, వేధిస్తున్నారని నిందితుల నుంచి విమర్శలు వస్తున్న తరుణంలో ప్రతి పోలీస్ స్టేషన్లో పక్కాగా సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం వల్ల మాత్రమే ఆయా దృశ్యాల ఆధారంగా నిజానిజాలు బయటకి వచ్చే అవకాశం ఉంటుందని తెల్పింది. కానీ నేటికీ అమలు నామమాత్రంగానే ఉన్నాయి.
ఇవీ చదవండి :