BRS in Maharashtra: భారత్ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో ఆ పార్టీని విస్తరించడం ప్రారంభించారు. తెలంగాణకు ఆనుకుని ఉన్న నాందేడ్ నుంచి మొదలుపెట్టి.. మరఠ్వాడాను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్రలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రత్యర్థి పార్టీకి ఉన్న పరిధిని దృష్టిలో ఉంచుకుని చంద్రశేఖర్ రావు, ఆయన సన్నిహితులు మహారాష్ట్రలో తమ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరఠ్వాడా ఎందుకు?: ముంబయి, పుణే, నాసిక్ వంటి నగరాలను వదిలిపెట్టి.. బీఆర్ఎస్ పార్టీ మరఠ్వాడాలోకి ప్రవేశిస్తోంది. ఇప్పుడిదే అంశం ఆ రాష్ట్రంలో చర్చకు దారితీస్తోంది. పెద్ద పెద్ద నగరాలను వదిలి.. కేసీఆర్ మరఠ్వాడాను ఎంచుకోవడం వెనక ఆంతర్యమేంటనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అయితే దీనికి సంబంధించి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కొన్ని ఆసక్తికర అంశాలను వివరించారు.
KCR Special Focus on Marathwada : 'తెలంగాణలోని సమీప భాగం మరఠ్వాడాలోని నాందేడ్ జిల్లాలో ఉంది. తెలంగాణలో జరిగిన అభివృద్ధి పనులను అక్కడి పౌరులు గమనిస్తున్నారు. అందుకే ముందుగా నాందేడ్‌లో బహిరంగ సభ నిర్వహించారు. మరఠ్వాడాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు.. ఒకప్పుడు తెలంగాణలో రైతులు ఎదుర్కొన్న సమస్యలు దాదాపు ఒకేలా ఉన్నాయి. తద్వారా ఇక్కడి రైతులకు అందుతున్న సౌకర్యాలు మనమూ పొందగలం అనే భావన మరఠ్వాడా రైతుల్లో ఉండటంతో ఇక్కడ బీఆర్‌ఎస్‌కు మంచి స్పందన లభిస్తోంది. అందుకే పార్టీని ముందుగా మరఠ్వాడాలో బలోపేతం చేస్తున్నాం' అని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వివరించారు.
నలుగురు ఎమ్మెల్యేల నిఘా..: బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జోగు రామన్న, హనుమంతు షిండేలు ఇప్పటికే మరఠ్వాడాపై నిఘా ఉంచారు. నాందేడ్‌తో సహా తెలంగాణ సరిహద్దులో గల మహారాష్ట్రలోని అనేక గ్రామాలు తెలంగాణ సేవా సౌకర్యాలకు ఆకర్షితులయ్యాయి. ఈ క్రమంలోనే ఇక్కడి కొన్ని గ్రామాలు తమ ఊళ్లనూ తెలంగాణలో చేర్చాలంటూ గతంలో డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో రాజకీయంగా పట్టు సాధించేందుకు ఇదే సరైన అవకాశం, సమయమని బీఆర్ఎస్ భావిస్తోంది.