Reaction on Amit Shah's comments in Chevella Sabha: కేంద్రహోం మంత్రి అమిత్‌షా చేవెళ్లలో జరిగినబీజేపీవిజయసంకల్ప సభలో పూర్తిగా అవాస్తవాలు మాట్లాడారని బీఆర్ఎస్ విమర్శించింది. కర్ణాటకలో ఓటమి తప్పదనే బాధలో.. అమిత్ షా ఆ విధంగా మాట్లాడారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. చేవెళ్లలో ఐటీఆర్ రాకుండా చేసిన అమిత్‌షాకి మాట్లాడే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు.
తెలంగాణ గడ్డపై.. బీజేపీ ఆటలను ప్రజలు సాగనివ్వరని ధ్వజమెత్తారు. కేంద్రమంత్రి అయి ఉండి.. అలా మాట్లాడడం సబబేనా అంటూ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ తెలంగాణ వచ్చి అలానే పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టి.. రాజకీయ లబ్ధి పొందాలన్న బీజేపీ ఆశలు ఎప్పటికీ నెరవేరవని మంత్రి జగదీశ్ రెడ్డి పునరుద్ఘాటించారు.
భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఓ మతానికి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు. ఆ వ్యాఖ్యలు బాధాకరమన్న ఆయన.. ముస్లింల రిజర్వేషన్లు తొలగించి ఇతరులకు కేటాయిస్తామని చెప్పడం దారుణమని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మత చిచ్చు పెట్టేందుకు అమిత్ షా యత్నిస్తున్నారని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించడం.. హస్యాస్పదమని రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. దేశంలో రెండు మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఆయన మాటలు ఉన్నాయని ధ్వజమెత్తారు. దేశ సమగ్రత కాపాడాల్సిన కేంద్ర మంత్రి.. విద్వేష రాజకీయాలకు విత్తనాలు చల్లుతున్నారని ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. అమిత్‌షా..కేంద్ర హోం మంత్రిగా కాకుండా ఓ ముఠా నాయకుడిగా మాట్లాడారని.. సీపీఐ రాష్ట్రకార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వారే తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు.