ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలనపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మరోసారి ఏపీ జలవనరులశాఖకు లేఖ రాసింది. రాయలసీమ ఎత్తిపోతల ఒక్కటే కాకుండా, అన్ని ప్రాజెక్టులు పరిశీలించాలన్న జలవనరులశాఖ... ఈ అంశంపై బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకోవాలంటూ వారం రోజుల కిందట లేఖ రాసింది. ఇంతలోనే మళ్లీ లేఖ రాసిన కృష్ణా బోర్డు.... ఈ నెల 19, 20 తేదీల్లో పరిశీలనకు వస్తామని చెప్పింది.
హరికేశ్ నేతృత్వంలో..
ప్రాజెక్టు గురించి అన్ని విషయాలు తెలిసిన అధికారిని నామినేట్ చేయాలని, సంబంధిత నివేదికలు అందజేయాలని కోరుతూ... కృష్ణా బోర్డు తరఫున హరికేశ్ మీనా సోమవారం రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పరిశీలించడానికి ఏర్పాటుచేసిన బృందానికి హరికేశ్ నేతృత్వం వహించనుండగా.... కార్యదర్శి రాయిపురే, బోర్డు సభ్యుడు ఎల్.బి.ముతంగ్, కేంద్ర జలసంఘంలో డైరెక్టర్‌గా ఉన్న దేవేందర్రావు సభ్యులుగా ఉన్నారు.