కరోనా మహమ్మారి పౌర సమాజానికి పాఠాలే కాదు.. గుణపాఠాలూ నేర్పించింది. అప్రమత్తంగా ఉండకపోతే వైరస్ బారిన పడక తప్పదని గ్రహించిన ప్రజలంతా ఎక్కడికక్కడ జాగ్రత్తలు పాటిస్తూ తమను తాము రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండోదశ ఉద్ధృతిలోనూ లక్షలాది మంది ప్రజలు కరోనా కాటుకు గురయ్యారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. మహమ్మారి ప్రజలను వదలడం లేదు.
ఈ క్రమంలోనే హైదరాబాద్ సింగరేణి కాలనీలో గత 23 ఏళ్లుగా రేషన్ దుకాణం నిర్వహిస్తోన్న పద్మ.. తన స్వీయ అనుభవం నుంచి చక్కటి ఆలోచన చేశారు. రేషన్ కోసం వచ్చే ప్రజలకు-తనకు కనీసం 5 అడుగుల భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేశారు. రేషన్ బియ్యం పంపిణీ చేయాలంటే ఐరిష్ లేదా మొబైల్ నెంబర్ ఓటీపీ కావాలి. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చే వినియోగదారుల నుంచి వాటిని సేకరించేందుకు కర్రకు ఐరిష్ కెమెరా ఏర్పాటు చేశారు. దాని ద్వారా భౌతిక దూరం పాటిస్తూ వినియోగదారుల వివరాలు సేకరించి రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు.
తండ్రి ఇచ్చిన సలహా..
పద్మ గతంలో కరోనా బారినపడ్డారు. ఆమెతో పాటు ఆమె తండ్రీ మహమ్మారి కోరల్లో చిక్కుకున్నారు. ఇద్దరూ కొన్ని రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండి కోలుకున్నారు. దీంతో తండ్రి ఇచ్చిన సలహా మేరకు మళ్లీ వైరస్ బారినపడకుండా ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టారు. తనతో పాటు దుకాణానికి వచ్చే ప్రజలకూ కరోనా సోకకుండా ఉండాలంటే ఐరిష్ సేకరణకు భౌతికదూరం ఉండేలా ఏర్పాట్లు చేయాలని భావించారు. వినియోగదారులను కౌంటర్‌కు 5 అడుగుల దూరంలో ఉంచి కర్రకు ఏర్పాటు చేసిన కెమెరా ద్వారా ఐరిష్ నమోదు చేసి బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. రోజుకు సుమారు 150 నుంచి 200 మందికి ఈ పద్ధతిలోనే బియ్యం పంపిణీ చేస్తున్నారు.