రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తులకు త్వరలో మోక్షం లభించనుంది. త్వరలో రేషన్‌కార్డులు జారీ చేస్తామని నాగార్జునసాగర్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించటంతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తరవాత ముఖ్యమంత్రి కేసీఆర్ రేషన్‌కార్డులు జారీ చేస్తామని ప్రకటించటం ఇదే తొలిసారి. రాష్ట్రం ఏర్పడిన సమయంలో 1.05 కోట్లవరకు కార్డులు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న కుటుంబాల సంఖ్యకన్నా వీటి సంఖ్య ఎక్కువని ప్రభుత్వం గుర్తించింది. అనర్హుల కార్డులను తొలగిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించటం అప్పట్లో సంచలనమైంది. ఆ తరవాత అధికారులు ఏరివేత ప్రక్రియను ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో తొలగించారు.
ఆరోగ్యశ్రీ పథకానికి, బోధన రుసుంల చెల్లింపునకు రేషన్‌కార్డు పనిచేయదని పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటంతో కొంతమంది స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అందజేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 87.54 లక్షల కార్డులు ఉన్నాయి. వారికి చౌకధరల దుకాణాల ద్వారా ప్రతినెలా సరకులు అందుతున్నాయి.