రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలన్నిటిలో రథసప్తమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి పల్లకి సేవలు, పాదపూజలు, అభిషేకాలు, అర్చనలతో ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.
వికారాబాద్ జిల్లా అనంతగిరిలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయంలో రథసప్తమి ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు దేవాలయాలనికి చేరుకున్నారు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారు సాయంత్రం వరకు సప్త వాహనాలపై ఊరేగనున్నారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై చంద్ర వాహన పల్లకి సేవతో ఉత్సవాలు ముగియనున్నాయి.
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో రథసప్తమి సంబురాలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచే స్వామి వారికి పల్లకి సేవ నిర్వహించారు. ఆలయ అర్చకులు రథసప్తమి వేడుకల్లో పారాయణం చేస్తూ... రథసప్తమి విశిష్టతను వివరించారు.
కొమురం భీం ఆసిఫాబాద్ పెద్దవాగు నది ఒడ్డున వెలసిన బాల ఈశ్వరుడి రథోత్సవం, జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. రథసప్తమి సందర్భంగా తొమ్మిది రోజులపాటు యాగాలు, అభిషేకాలు, పూజలు, పారాయణాలు, కుంకుమార్చనలు నిర్వహిస్తారు. ఈ వేడుకలకు పక్క రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలివస్తున్నారు.