green Comet appears in Vijayawada : ఏపీలోని విజయవాడలో రెండు రోజుల్లో ఆకాశంలో అద్భుతం ఆవిష్కతం కానుంది. వేల సంవత్సరాల కిందట కనిపించిన తోక చుక్క తిరిగి ఆకాశంలో కనువిందు చేయనుంది. గ్రీన్ కొమెట్‌గా పిలిచే ఆ తోక చుక్కను ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు విజయవాడ నగర వాసులు స్పష్టంగా వీక్షించవచ్చు. నగరానికి ఉత్తర దిక్కున ధృవ నక్షత్రం, సప్తర్షి మండలం మధ్యలో చూడవచ్చు. మంచు యుగంలో 50 వేల సంవత్సరాల క్రితం కనిపించిన తోక చుక్క ప్రస్తుతం కనిపించనున్నట్లు అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు.
సౌరవ్యవస్థలో తోక చుక్కలకు ఎంతో ప్రాధాన్యం: తోక చుక్కలు అంటే వాయువులతో నిండిన అంతరిక్ష మంచుగోళాలు. ఒక నగరం అంత వ్యాసంతో ఉంటాయి. సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు వేడెక్కి ధూళిని, వాయువులను అమితమైన వెలుగుతో బయటకు వెదజల్లుతాయి. అందువల్లే అవి తోకతో కనిపిస్తాయి. సౌరవ్యవస్థలో తోక చుక్కలకు ఎంతో ప్రాధాన్యం ఉంది.