అన్ని మతాలకు సమాన గౌరవాన్నిస్తూ మత సామరస్యం కోసం తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా.. ముస్లిం సోదరులకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్థికంగా వెనకబడిన ముస్లింల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు గుర్తుచేశారు.
రంజాన్ మాసం ప్రారంభం..సీఎం శుభాకాంక్షలు - సీఎం కేసీఆర్ తాజా వార్తలు
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు, దైవప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. గంగాజమునా తహజీబ్ జీవన విధానం మరింతగా పరిఢవిల్లాలని, సోదరభావ స్ఫూర్తి గొప్పగా బలపడాలని అభిలషించారు.
![రంజాన్ మాసం ప్రారంభం..సీఎం శుభాకాంక్షలు Ramzan begins CM kcr, CM kcr Ramzanwishes to muslims](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11394185-656-11394185-1618351007580.jpg)
షాదీ ముబారక్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు పేదింటి ముస్లిం ఆడపిల్లల జీవితాల్లో గుణాత్మక మార్పునకు దోహదపడుతోందన్నారు. మైనార్టీ బిడ్డల చదువుల కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలు విజయవంతం అయ్యాయని తెలిపారు. ప్రత్యేక గురుకులాలు సత్ఫలితాలు ఇవ్వడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో ముస్లింల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి, వారి అభివృద్ధికి బాటలు వేస్తుండటంపై కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా తిరిగి ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రార్థనలు చేసుకోవాల్సిందిగా సీఎం విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి :తెరాస, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం