ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని శేషాచలం సహా సమీప అడవులు ఎన్నో ప్రకృతి అందాలకు నెలవు. వర్షాకాలంలో ఈ అందాలు పచ్చని శోభను సంతరించుకుని మరింతగా ఆకట్టుకుంటూయి. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో వెలుగుచూస్తున్న కొత్త అందాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. అలాంటి కోవకే చెందుతుంది రామచంద్రాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలోని ఈ జలపాతం.
ఈ జలపాతం ఇటీవలే వెలుగులోకి వచ్చినా.. ఎంతో ప్రఖ్యాతి గాంచింది. హరిత వర్ణంతో కళకళలాడే ఈ అడవి, జలపాత అందాలను వీక్షించేందుకు ఇక్కడికి చేరుకోవాలంటే కాస్త శ్రమించాల్సిందే. రామచంద్రాపురం నుంచి రెండు కిలోమీటర్ల పాటు కొండలు, కోనలు దాటుకుంటూ వెళ్తేకానీ దీనిని చేరుకోలేం.