తెలంగాణ

telangana

ETV Bharat / state

Ram Ki Bandi: ఎంబీఏ చదివి.. దోసెల బండి పెట్టి..

ఎంబీఏ చేసిన ఆ కుర్రాడు ఉద్యోగం కోసం వెళ్తే నెలకు రూ.10 వేలు జీతం ఇస్తామన్నారు. ఆ మాటలకు ఖంగు తిన్నాడా కుర్రాడు. తమ టిఫిన్‌ బండి దగ్గర పనిచేసే వంట మాస్టార్లకే రూ.20-30వేలు ఇస్తుంటే... ‘ఉద్యోగం కాదు, వ్యాపారమే కరెక్టు’ అనుకుని తండ్రి నడిపే టిఫిన్‌ బండిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ నిర్ణయం అతడి జీవితాన్నే మార్చేసింది. పదేళ్ల కిందట రోడ్డు పక్కన మొదలైన ‘రామ్‌ కీ బండి’ ప్రస్థానం తాజాగా హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరింది.

Ram Ki Bandi
Ram Ki Bandi

By

Published : Oct 31, 2021, 6:59 PM IST

నాంపల్లి రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఉదయం నాలుగు గంటలపుడు ఒకటే హడావుడి ఉంటుంది. నైట్‌ డ్యూటీ చేసే ఉద్యోగులూ, యువతా, ప్రయాణికులూ, అటుగా పనిమీద వెళ్లేవాళ్లూ... అక్కడుండే ‘రామ్‌ కీ బండి’ దగ్గర ఆగి వేడి వేడి దోసెలు లాగిస్తుంటారు. కొందరైతే సుదూరాల నుంచి దోసె తినేందుకే అక్కడికి వస్తారు. దోసెకే అంత ఇదా అంటే... అదే మరి ‘రామ్‌ కీ బండి’ ప్రత్యేకత. బటర్‌, చీజ్‌, పనీర్‌, చీజ్‌ స్వీట్‌ కార్న్‌, పిజ్జా, షెజ్వాన్‌... ఇలా ఓ డజనుకుపైగా రకాల్లో దోసెలూ... బటర్‌ కార్న్‌, చీజ్‌, తవా ఫ్రై... ఇలా ఓ అరడజను రకాల్లో ఇడ్లీలూ అక్కడ దొరుకుతాయి.

1989లో మొదలు..

రామ్‌ వాళ్ల నాన్న లక్ష్మణరావు షిండే... ఆర్మీలో సిపాయి ఎంపికలు జరుగుతున్నాయంటే 1989లో కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. కానీ ఎంపిక కాలేదు. ఖాళీ చేతులతో ఊరెళ్లడం ఇష్టంలేక బండి మీద టిఫిన్‌ సెంటర్‌ నడుపుతూ ఉపాధి పొందేవాడు. నాంపల్లి, పంజాగుట్ట, అమీర్‌పేట్‌... ఇలా వేర్వేరు చోట్ల రోజంతా బండి తిప్పుతూ ఇడ్లీ, దోసె అమ్మేవాడు. రామ్‌కు ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లెలు. రూ.20 అద్దె చెల్లించి చిన్న గదిలోనే అందరూ ఉండేవారు. రామ్‌ కూడా చిన్నపుడు బండి దగ్గరకు వచ్చి స్కూల్‌ టైమ్‌ వరకూ ఉల్లిపాయలు తరుగుతూ, పాత్రలు శుభ్రం చేస్తూ, ప్లేట్లు అందిస్తూ తండ్రికి సాయం చేసేవాడు. తల్లిదండ్రుల కష్టాన్ని చిన్నప్పట్నుంచీ చూస్తూ వచ్చిన రామ్‌ ఉద్యోగం చేసి కుటుంబాన్ని ఆర్థికంగా ఉన్నతంగా నిలబెట్టాలనుకుని ఎంబీఏ పూర్తిచేశాడు. కానీ ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాక తెలిసింది, టిఫిన్‌ సెంటర్‌నే బాగా నడిపి ఎక్కువ సంపాదించవచ్చని. తండ్రి అయిష్టంగానే అంగీకరించాడు. అలా 2010లో టిఫిన్‌ బండి నిర్వహణ బాధ్యతను తీసుకున్నాడు రామ్‌.

ప్రయోగాలు చేశాడు...

మూడు రకాల దోసెలూ, ఇడ్లీ తప్పించి ఇతర రుచులు ఆ బండి దగ్గర ఉండేవి కాదు. నగరంలో వేల మంది అవే టిఫిన్లను అందిస్తున్నపుడు ఎవరైనా తన బండి దగ్గరకే ఎందుకు రావాలని తనను తాను ప్రశ్నించుకున్నాడు రామ్‌. ఓసారి పిజ్జా బేస్‌కు కాయగూర ముక్కలూ, చీజ్‌ జోడించడం చూశాడు. అలా దోసెకు ఎందుకు చేయకూడదన్న ఆలోచన వచ్చింది రామ్‌కి. దాంతో దోసెమీద చీజ్‌, పనీర్‌, కూరగాయ ముక్కలు వేసి ప్రయోగం చేశాడు. కానీ అవన్నీ ఉడికేసరికి దోసె మాడినట్లు తయారయ్యేది. తండ్రి సలహాతో దోసెమీద ఉప్మాని పల్చగా వేసి దానిమీద ఇవన్నీ వేయడం మొదలుపెట్టాడు. అప్పుడు దోసెకు అనుకున్న రూపూ, రుచీ వచ్చింది. దాంతో ‘రామ్‌ కీ బండి’ దగ్గరకు చాలా బళ్లూ, కార్లూ ఆగడం మొదలైంది. కస్టమర్ల సలహాలూ, సూచనలూ తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఉన్నవాటిని మెరుగుపర్చుతూనే కొత్త రుచుల్నీ చేర్చాడు. అదే సమయంలో నగరంలో నైట్‌ షిఫ్టుల్లో పనిచేసేవాళ్లూ, రాత్రిళ్లు ప్రయాణించేవాళ్లనీ చూశాడు. వారికి అనుకూలంగా ఉంటుందని తన బండిని తెల్లవారు జామున మూడింటికే తెరవడం మొదలుపెట్టాడు. రుచి, సమయం ‘రామ్‌ కీ బండి’ని ప్రత్యేకంగా నిలిపాయి. అందుకే అయిదు నిమిషాల్లో 55 దోసెలు అమ్ముడవుతాయక్కడ. ఉదయం తొమ్మిదింటికే దుకాణం మూసేస్తారు కూడా. ఆ సమయానికే వేల మంది ఆకలి తీర్చుకుంటారు. దోసె ధరలు రూ.50-200 మధ్య ఉంటాయి. ఈ దోసెల రుచికి దాసోహమైన సచిన్‌, హర్ష్‌ జైన్‌ పెట్టుబడికి ముందుకు రావడంతో బేగం బజార్‌, బేగంపేట్‌, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ ప్రాంతాల్లో ‘రామ్‌ కీ బండి’ ఔట్‌లెట్లు తెరిచాడు. బంజారాహిల్స్‌లో ‘రామ్స్‌ దోసె హౌజ్‌’ రెస్టరెంట్‌నూ ప్రారంభించి రెండేళ్లలో లాభాల్లోకి తీసుకొచ్చి దాని నిర్వహణను తన బంధువుకి అప్పగించాడు. ఈమధ్యే హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ఓ ఔట్‌లెట్‌ను తెరిచాడు. కానీ ఇప్పటికీ నాంపల్లి బండి దగ్గరే పూర్తి సమయం ఉంటూ, ఆ తర్వాత మిగతా ఔట్‌లెట్లని పర్యవేక్షిస్తాడు. హైదరాబాద్‌లో మరింత మందికి రుచికరమైన దోసెల్ని అందిస్తూనే ఇతర నగరాలకూ విస్తరించడమే తన లక్ష్యం అంటాడు రామ్‌.

ఇదీచూడండి:Hunters Killing Tigers: పులిని చంపిన వేటగాళ్లు.. చర్మాన్ని తరలిస్తుండగా...

ABOUT THE AUTHOR

...view details