Ram Gopal Varma Song on Hyderabad Nagar Mayor: ఎప్పుడు సోషల్ మీడియాలో వివాదాస్పాద పోస్టులు పెడుతూ ట్రెండ్ అయ్యే సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి వార్తలోకి ఎక్కాడు. ఇటివలే హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో వీధికుక్కలపై దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై ఘాటుగా స్పందించిన ఆయన.. హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో అందరికి తెలిసిన విషయమే. దీనికి ఆమె కూడా ఘాటుగానే స్పందించి వివరణ ఇచ్చారు.
తాజాగా రామ్ గోపాల్ వర్మ మరోసారి వీధి కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడ్ని నేపథ్యంలో తీసుకొని ఓ సాంగ్‌ను విడుదల చేశారు. "అడుక్కుతిన్న పన్నులన్నీ మింగిన మీరు.. మొరిగించి.. కరిపించి.. చంపించారు" అంటూ మొదలయ్యే ఈ సాంగ్ "పాపం ఎవరిది మేయర్.. ప్రాణం ఎవరిది మేయర్" అంటూ సాగిపోతుంది. ఈ వీడియోను ఆయన తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ట్విటర్ ద్వారా విడుదల చేయగా మంచి ఆదరణ లభిస్తోంది. మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సాగిపోయే ఈ సాంగ్ మరోసారి అంబర్పేట్ ఘటనపై రామ్‌గోపాల్ వర్మ ప్రశ్నించినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా సాంగ్‌లో ఇటీవలే వీధి కుక్కల దాడిలో గాయపడిన చిన్నారుల వీడియోలు ఉన్నాయి.
ఇది వరకే హైదరాబాద్‌లో వీధి కుక్కల దాడుల గురించి ప్రశ్నించిన ఆర్జీవీ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ఆమె తన పెంపుడు కుక్కకు భోజనం పెడుతున్న వీడియోను షేర్ చేస్తూ హైదరాబాద్‌లో ఉన్న 5లక్షల కుక్కలన్నీటిని మేయర్ ఇంట్లో విడిచిపెట్టాలంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఎప్పుడు వివాదాస్పాద పోస్టులు పెడుతూ వార్తల్లో నిలిచే ఆర్జీవీ ఓ ఇంటర్య్వూలో తన జీవితంలో ఎప్పుడు బాధపడలేదని.. కానీ అంబర్‌పేటలో కుక్కల దాడిలో బాలుడి మృతి చెందిన వీడియో బాగా కలిచివేసిందని చెప్పుకొచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇది ఇలా ఉండగా.. అంబర్ పేటలో జరిగిన ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. బాలుడు కుటుంబానికి మంత్రి కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకోడదని విచారం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ తరుపున బాలుడు కుటుంబానికి రూ.10లక్షలు పరిహారం అందజేశారు. ఆ తరువాత జీహెచ్ఎంసీ మేయర్ ఆధ్వర్యంలో అన్ని పార్టీల కార్పొరేట్లతో మీటింగ్ ఏర్పాటు చేసి వీధి కుక్కల నివారణకు తగు చర్యలు తీసుకోనేందుకు చర్చించారు. కుక్కల నివారణకు అధికారులు తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. వాటి నివారణకు ఎప్పటికప్పుడు టీకాలు వేస్తూ సంతోనోత్పత్తి నివారణకు శస్త్ర చికిత్సలు చేస్తున్నారు.