ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన యువతి అవయవదానానికి తల్లిదండ్రులు అంగీకరించారు. ఉన్నత చదువులు చదివించి మంచి స్థానంలో చూడాలని ఆశించామని తెలిపారు. అంతలోనే తమ కలల్ని ఊహించని ప్రమాదం కాటేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కూతురి అవయవాల వల్ల కొందరికైనా ప్రాణదానం కలుగుతుందని అన్నారు. మృతదేహన్ని తరలించేందుకు తెలుగువాళ్లు అన్ని రకాలుగా సహకరిస్తున్నారని తెలిపారు.
అవయవదానానికి ఒప్పుకున్న రక్షిత తల్లిదండ్రులు
ఆస్ట్రేలియాలో మృతి చెందిన నాగర్‌కర్నూల్ జిల్లా యువతి తల్లిదండ్రులు అవయవదానానికి ఒప్పుకున్నారు. యువతి తండ్రి వెంకట్‌రెడ్డి విశ్రాంత ఆర్మీ ఉద్యోగి, తల్లి అనిత గృహిణి హైదరాబాద్‌లోని బడంగ్‌పేట్‌లోని కేశవరెడ్డి నగర్ కాలనీలో నివాసముంటున్నారు. వంగూరు మండలం దిండి చింతపల్లికి చెందిన రక్షిత(22) ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందింది.
అవయవదానానికి ఒప్పుకున్న రక్షిత తల్లిదండ్రులు
ఆస్ట్రేలియాలోని ఐఐబీఐటీ యూనివర్శిటీలో బీటెక్ చదివేందుకు వెళ్లినట్లు యువతి తల్లిదండ్రులు వెల్లడించారు. గత ఏడాది నవంబర్ 19న సిడ్నీకి వెళ్లిన రక్షిత.. ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. డిసెంబర్ 31న ఉదయం యువతి స్కూటీపై వెళ్తుండగా డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయమై బ్రెయిన్‌డెడ్‌తో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.